కులవృత్తుల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి: జగదీశ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-08-22T20:00:05+05:30 IST

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చెయ్యాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

కులవృత్తుల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి: జగదీశ్ రెడ్డి

సూర్యాపేటజిల్లా: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చెయ్యాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని  రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అందులో భాగంగా మొదట వ్యవసాయరంగం మీద రైతాంగానికి విశ్వసనీయత కల్పించిన సీఎం కేసీఆర్ అందుకు అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి ప్రణాళికలు రూపొందించారని ఆయన వెల్లడించారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో నాయీబ్రాహ్మణులతో పాటు రజకులకు ఉచిత విద్యుత్ మీటర్ల పంపిణీ కార్యక్రమాన్నిమొట్టమొదటి సారిగా ఆయన శనివారం రాత్రి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే గొర్రెల కాపారులకు సబ్సిడీ మీద గొర్రెలు పంపిణీ చేయడం తో పాటు మత్యకారులకు చేపల పెంపకాన్ని ప్రోత్సాహం కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.


చితికి పోయిన ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే మాంసం తో పాటు చేపల పెంపకంలో యావత్ భారత దేశంలోననే తెలంగాణా రాష్ట్రం అగ్రభాగం లో ఉందని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడిన శ్రమనే కారణమని ఆయన పేర్కొన్నారు.అన్ని వృత్తుల వారిని ఆర్థికంగా పరిపుష్టం చేయాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అటు యాదవులను ఇటు మత్యకారులకు సబ్సిడీలమీద గొఱ్ఱెలు,చేపలు అందించినట్లుగానే నాయీ బ్రాహ్మణులకు,రజకులకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించారన్నారు. అయితే ఆయా సంఘాల నుండి తమ కుల వృత్తులకు ఉచిత విద్యుత్ అవసరమని ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం మీద ఎంతటి భారం పడినా ఖాతరు చెయ్యకుండా ఉచిత విద్యుత్ ను అందించేందుకు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక మని ఆయన అభివర్ణించారు. 


ఇప్పటికే ఆయా వృత్తులను చేపట్టిన వారి పేర్ల మీద మీటర్లు ఉంటే వారికి ఉచితంగా విద్యుత్ నందించాలని నిర్ణయం తీసుకున్నారని,లేని వారికి ప్రభుత్వమే మీటర్లు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని సూర్యపేట జిల్లా కేంద్రంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,800 మందికి ఉచితంగా విద్యుత్ మీటర్లు  అందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.ఒక్క సూర్యపేట జిల్లాలోనే 784 మందికి విద్యుత్ మీటర్లను అందజేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-08-22T20:00:05+05:30 IST