త్యాగనిరతి సూర్యాపేట రక్తంలోనే ఉంది: జగదీశ్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-16T22:50:03+05:30 IST

త్యాగం అన్నది సూర్యపేట రక్తంలోనే ఇమిడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

త్యాగనిరతి సూర్యాపేట రక్తంలోనే ఉంది: జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: త్యాగం అన్నది సూర్యాపేట రక్తంలోనే ఇమిడి ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే సూర్యాపేట పట్టణాన్నీ పర్యాయ పదంగా వేగుచుక్క అని అభివర్ణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అటువంటి సూర్యాపేట పట్టణం కొత్త రాష్ట్రంలో అభివృద్ధిలో పరుగులు పెడుతూ రాష్ట్రంలో నీ మిగితా ప్రాంతాలకు నమూనాగా మారనుందని ఆయన స్పష్టం చేశారు.విజయదశమి వేడుకలను పురస్కరించుకుని ఆయన శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.సామూహిక ప్రార్థనలు, సహపంక్తి బోజనాలతో గడిపిన ఆయన సాయంత్రం జంట పావురాలను గగనవిధుల్లోకి విడిచి విజయదశమి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆదర్శ పట్టణంగా సూర్యాపేట ఉండడంతో పాటు శాంతియుత పట్టణంగా ఎదగడం అభినందనీయమన్నారు.


ఇప్పటికే ఆరోగ్యవంతమైన సమాజంగా పట్టణానికి పేరుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలంనెరవేరిందని ఆయన కొనియాడారు. కొత్త రాష్ట్రంలో రైతు సంక్షేమం ఉండాలని ఆయన కన్న కలలకు ప్రకృతి తోడు కావడంతో తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పసిడి రాసులతో నిండిపోయిందన్నారు. చాలినన్ని వర్షాలు చేతి నిండా పాడితో ప్రతి రైతు మొహంలో నూతనోత్సాహం తొంగి చూస్తుందని ఆయన కితాబిచ్చారు. సర్వమత సమ్మేళనంగా తెలంగాణ రాష్ట్రం వర్ధిల్లుతుందని ఆయన తెలిపారు. అన్ని మతాల ఆచార వ్యవహారాలను గౌరవించడమే కాకుండా పండుగలలో హిందు,ముస్లిం,క్రిస్టియన్ అన్న తేడా లేకుండా పాల్గొనడడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 


కరోనాతో కిందటేడాది దసరా పండుగ జరుపుకోలేక పోవడమే కాకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో తీసుకొన్న ప్రతి నిర్ణయంతో సేఫ్‌గా బయట పడ్డామన్నారు.అలా అని కనిపించని శత్రువు మీద జరుగుతున్నయుద్ధాన్ని కొనసాగించాలని అందుకు మాస్క్‌లు, శాని టైజర్ల వాడకం తప్పనిసరి అని ఆయన చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,టి ఆర్ యస్ నాయకులు గండూరీ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-16T22:50:03+05:30 IST