బెంజ్ మంత్రిపై మరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్న

ABN , First Publish Date - 2020-09-19T17:45:15+05:30 IST

ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ14 నిందితుడు కార్తీక్.. మంత్రి జయరాంకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు

బెంజ్ మంత్రిపై మరిన్ని ఆధారాలు బయటపెట్టిన అయ్యన్న

విశాఖ: ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏ14 నిందితుడు కార్తీక్.. మంత్రి జయరాంకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ నేత చేసిన ఆరోపణలను మంత్రి కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అయ్యన్నపాత్రుడు బెంజ్ కారుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను మీడియాకు చూపించారు. ఫొటోలు, వీడియోలు స్క్రీన్ మీద వేసి తేటతెల్లం చేశారు. ఇన్ని ఆధారాలు ఇచ్చినా మంత్రి జయరాంపై సీఎం జగన్ ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూస్తామని తెలిపారు.


అయ్యన్నపాత్రుడు ఇంకేమి అన్నారంటే..

‘మంత్రి జయరాం అవినీతిపై ఫిర్యాదు చేస్తే సరైనా స్పందన లేదు. ఫోన్లో కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు మెసేజ్ కూడా రాలేదు. అవినీతిపై సీఎం జగన్ ఇచ్చిన స్పీచ్‌కు ఫిర్యాదుకు ఏమైనా సంబంధం ఉందా? ఓ మాజీ మంత్రే ఫిర్యాదు చేస్తేనే దిక్కులేదు. అలాంటిది సామాన్యుడి ఫిర్యాదు చేస్తే దిక్కుమొక్కు ఉంటుందా? తక్షణమే మంత్రి అవినీతిపై ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకోవాలి. అచ్చెన్నాయుడిపై ఏ ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు మంత్రి జయరాంపై పక్కా ఆధారాలు చూపించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటి వరకు ఏ మంత్రిపైనా అవినీతి ఆరోపణలు చేయలేదు. ఆధారాలు లేవు కాబట్టే ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు మంత్రి జయరాం గురించి ఆధారాలు దొరికాయి కాబట్టే అవినీతి గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ కారు మంత్రిది కాకపోతే బెంజ్ కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఎందుకుంది? కారును ఇప్పటికీ మంత్రి కొడుకే వాడుతున్నాడు. మంత్రి జయరామే స్వయంగా బాధ్యత వహించి రాజీనామా చేస్తారా? లేదా ముఖ్యమంత్రి ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూస్తాం. అలాగే మంత్రి జయరాంకు సంబంధించిన భూకుంభకోణాలపై కూడా త్వరలోనే ఆధారాలు బయటపెడతా. తనను ఏం చేసినా ఫర్వాలేదు. జైల్లో పెట్టినా.. చంపినా భయపడను’ అని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.



Updated Date - 2020-09-19T17:45:15+05:30 IST