‘అత్త పగులగొడితే మట్టి కుండ.. కోడలు పగులగొడితే..!’

ABN , First Publish Date - 2021-06-14T19:56:23+05:30 IST

‘అత్త పగులగొడితే మట్టి కుండ...కోడలు పగులగొడితే బంగారు కుండ’

‘అత్త పగులగొడితే మట్టి కుండ.. కోడలు పగులగొడితే..!’

  • బీజేపీ తీరుపై మంత్రి కేఎన్‌ నెహ్రూ


చెన్నై/పెరంబూర్‌ : ‘అత్త పగులగొడితే మట్టి కుండ...కోడలు పగులగొడితే బంగారు కుండ’ అన్న చందంగా బీజేపీ తీరు ఉందని మంత్రి కేఎన్‌ నెహ్రూ ఎద్దేవా చేశారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం కలెక్టర్‌ ఎస్‌.శివరాసు అధ్యక్షతన రేషన్‌కార్డుదారులకు రూ.2 వేల నగదు, 14 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీని మంత్రి నెహ్రూ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన 27 జిల్లాల్లో టాస్మాక్‌ దుకాణాలు ప్రారంభించామన్నారు. ఇందుకోసం వైద్యనిపుణుల సలహాలు, సూచనలతో పాటు మద్యం కోసం పలువురు అక్రమాలకు పాల్పడడాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 


ఈ నిర్ణయంపై డీఎంకే కూటమి పార్టీల్లో ఎలాంటి విభేధాలు లేవన్నారు. ఈ నిర్ణయం మార్చుకోవాలంటున్న కమ్యూనిస్టు పార్టీల నేతలతో తమ పార్టీ నేతలు చర్చలు జరిపి ఒప్పిస్తారని అన్నారు. బీజేపీ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు యధావిధిగా నడుస్తున్నాయని, ఇక్కడ మాత్రం రాజకీయం చేస్తోందని విమర్శించారు. తాజాగా, పుదుచ్చేరిలో కూడా మద్యం దుకాణాలు తెరవాలని పార్టీ ఎమ్మెల్యే గవర్నర్‌కు లేఖ రాశారని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేసే ఉద్దేశం లేదని, కరోనా నుంచి ప్రజలను రక్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలిపారు.

Updated Date - 2021-06-14T19:56:23+05:30 IST