పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపుపై మంత్రి Kodali Nani సంచలన వ్యాఖ్యలు..

ABN , First Publish Date - 2021-11-09T17:34:16+05:30 IST

భారీగా పెరిగిన పెట్రో, డీజిల్ ధరలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాస్త ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

పెట్రో, డీజిల్ ధరలు తగ్గింపుపై మంత్రి Kodali Nani సంచలన వ్యాఖ్యలు..

అమరావతి: భారీగా పెరిగిన పెట్రో, డీజిల్ ధరలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం కాస్త ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఒకట్రెండు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ఊసే లేదు. ఇటు తెలంగాణ ప్రభుత్వం తగ్గించే ప్రసక్తే తేల్చి చెప్పేసింది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి కొడాలి నాని స్పందించారు.


ఎందుకు తగ్గించాలి..?

ఇవాళ మీడియాతో మాట్లాడిన నాని.. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై సంచలన వ్యాఖ్యలే చేశారు. పెట్రో భారాన్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేదే లేదని తేల్చేశారు. ‘‘అసలు మేమెందుకు తగ్గించాలి.. తగ్గించి మా ఆదాయాన్ని ఎందుకు కోల్పోవాలి’’ అని మంత్రి మీడియానే ఎదురు ప్రశ్నించారు. తిరుపతి, బద్వేల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు రాలేదని.. దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ చిత్తుగా ఓడిపోయిందని ఆయన అన్నారు. ఉపఎన్నికల్లో బీజేపీని ప్రజలు పెట్రోల్‌పోసి తగలబెట్టారని.. ఇలా ఓడిపోయింది కాబట్టే పెట్రో, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించిందని కొడాలి చెప్పుకొచ్చారు.


ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతారేంటి.!?

‘‘బీజేపీ అరాచకాల పార్టీ.. కులమతాలు రెచ్చగొట్టే పార్టీ. ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావట్లేదంటే ఎందుకో ఆలోచించాలి. పెట్రోల్‌ ధరల ప్రభావం బీజేపీపై పడింది. బీజేపీ నేతలు ఇంకా భ్రమల్లోనే ఉన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ధి రాలేదు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేసినా జగన్‌ను ఏమీ చేయలేరు. ఇక్కడ మేకలు, నక్కలు ఏమీ లేవు.. పులివెందుల పులి జగన్‌. కేంద్రాన్ని అడగాల్సినవి రాష్ట్రాన్ని అడుగుతారా...?. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్‌ తగ్గించేది లేదు’’ అని నాని తేల్చి చెప్పేశారు.


పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్..?

ప్రభుత్వం రేట్లు తగ్గించాలని సిగ్గులేకుండా ఏపీ బీజేపీ ఏదేదో మాట్లాడుతోందని.. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చెప్పాలని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్రమే పెట్రోల్ రేట్లు తగ్గించాలని కొడాలినాని అన్నారు. మరోవైపు పెరిగిన పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గించాలంటూ ఏపీ వ్యాప్తంగా టీడీపీతో పాటు పలు ప్రజా సంఘాలు వినూత్న రీతుల్లో నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-11-09T17:34:16+05:30 IST