ఆ దేవుడు క్షమించడు: మంత్రి కొడాలి

ABN , First Publish Date - 2021-07-09T23:27:05+05:30 IST

శ్రీశైలంలతో ఉన్న కొద్దీ నీటిని రైతుల అవసరాలను పట్టించుకోకుండా విద్యుదుత్పాదనకు వాడితే తెలంగాణా

ఆ దేవుడు క్షమించడు:  మంత్రి కొడాలి

కృష్ణా: శ్రీశైలంలతో ఉన్న కొద్దీ నీటిని రైతుల అవసరాలను పట్టించుకోకుండా విద్యుదుత్పాదనకు వాడితే తెలంగాణా ప్రభుత్వాన్ని ఆ దేవుడు క్షమించడని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొడాలి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలా మేలు జరగాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి తాపత్రయమన్నారు. రైతుల కోసం, వారి సంక్షేమం కోసం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయలు పెట్టుబడి సాయం అందించారన్నారు. ఈ యేడాది కాలువలపైనే కృష్ణాడెల్టాలో వ్యవసాయం ఆధారపడి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలపై ఆధారపడే ఏపీలో రైతాంగం పంటలు పండించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణా ప్రభుత్వం అడ్డగోలుగా నీటిని మళ్లించి విద్యుదుత్పాదనకు వినియోగిస్తుందని ఆయన ఆరోపించారు.


తాగు, సాగు అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విద్యుత్‌కు మాత్రమే ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల మీదుగా ఇప్పుడు వదులుతున్న నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న కొద్దీ నీటిని రైతుల అవసరాలను పట్టించుకోకుండా విద్యుదుత్పాదనకు వాడితే ఆ దేవుడు క్షమించడని ఆయన అన్నారు. 

Updated Date - 2021-07-09T23:27:05+05:30 IST