Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి కొప్పుల ఆడియో కలకలం

- ఎంపీటీసీతో ఫోన్‌లో మాట్లాడిన సంభాషణలు లీక్‌

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒక ఎంపీటీసీతో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఫోన్‌లో వివాదస్పదంగా మాట్లాడిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతున్నది. ఇందులో ఆయన అధికార పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పార్టీలో ఉంటే ఉంటడు, ఈటెల రాజేందర్‌తో పోతడని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, మరికొందరు ఎంపీటీసీ సభ్యుల గురించి అసభ్యకరంగా మాట్లాడడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడిన సంభాషణ ఆడియోను సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కాంగ్రెస్‌ నేత శశిభూషన్‌ కాచె డిమాండ్‌ చేశారు. 

రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా, అందులో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మండలి విప్‌ టి భాను ప్రసాదరావు, మాజీ మంత్రి ఎల్‌ రమణ పోటీ చేస్తున్నారు. రెబల్స్‌గా కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ నామినేషన్‌ వేసి పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన మరొక నాయకుడు సారాబుడ్ల ప్రభాకర్‌ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ నేతలు  900 మందికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను క్యాంపునకు తరలించారు. 

-  సోషల్‌ మీడియాలో వైరల్‌

నామినేషన్లు దాఖలు చేసే సమయంలో పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం అబ్బాపూర్‌ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశ్వర్లు ధర్మారం, రామడుగు మండలాలకు చెందిన ఎంపీటీసీలను సమీకరించి ఇతరులు నామినేషన్లు వేసేందుకు సహకరిస్తున్నారంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సమాచారం అందింది. దీంతో మంత్రి ఆయనకు ఫోన్‌ చేసినట్లు తెలిసింది. ఆయనతో మాట్లాడిన ఫోన్‌ సంభాషణ సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం సంచలనం సృష్టిస్తున్నది. ఆ సంభాషణల్లో మంత్రి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మను రఘువీర్‌ సింగ్‌ పార్టీలో ఉంటే ఉంటరు.. ఈటల రాజేందర్‌ పోతారని అన్నారు. ఐదు, పది మంది ఎంపీటీసీలు కూడా ఉంటే ఉంటరు.. పోతే పోతరని అంటూ మాట్లా డిన మాటలు ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి హోదాలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడమేమిటీ అనే చర్చ నడుస్తున్నది. ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న పుట్ట మధూకర్‌, రఽఘువీర్‌సింగ్‌ కూడా ఆయన వెంట పార్టీ మారతా రనే ప్రచారం జరిగింది. ఆయన పార్టీలో ఉన్నంత వరకు మాత్రమే ఆయన వెంట నడిచామని, పార్టీ మారిన తర్వాత ఆయనకు, తమకు సంబంధం లేదని అప్పట్లోనే పుట్ట మధు ప్రకటించారు. జడ్పీ చైర్మన్‌ హోదాలో ఉన్న ఆయన మంథని నియోజకవర్గ ఇన్‌చార్జిగా కూడా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం నియోజకవర్గంలోని అందరు ఎంపీటీసీలు, కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఈ క్రమంలో మంత్రి ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడడం, రఘువీర్‌ సింగ్‌ప్లై అమర్యాదకరంగా మాట్లాడడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వాళ్లే మెజారిటీ ఓటర్లు ఉండగా, ఎక్కడ క్రాస్‌ ఓటింగ్‌ జరుగుతుందోననే భయం పార్టీ నేతలను వెంటాడుతున్నది. ఈ క్రమంలో మంత్రి మాట్లాడిన ఆడియో సంభాషణలు లీక్‌ కావడం ఎటు దారితీస్తుందోననే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆందోళన మొదలయ్యింది.

Advertisement
Advertisement