ఆస్తి చిక్కులుండవు

ABN , First Publish Date - 2020-10-14T07:37:55+05:30 IST

వ్యవసాయేతర భూములను ధరణిలో చేర్చేందుకు ప్రభుత్వం ప్రస్తుతం కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోనివారు ..

ఆస్తి చిక్కులుండవు

భూసమస్యలు లేకుండా చేసేందుకే కొత్త చట్టాలు!

వార్డు కమిటీల సూచనలే కౌన్సిల్లో చర్చిస్తారు

రాజకీయానికి అతీతంగా కమిటీల ఎన్నికలు

అక్రమ నిర్మాణాలు, పచ్చదనంపై వీటి నిఘా

కాంగ్రెస్‌ వల్లే రాజధానిలో ఫార్మా కాలుష్యం

శాసనసభలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు


ఫార్మాసిటీ గురించి, పర్యావరణం గురించి కాంగ్రెస్‌ మాట్లాడడం చూస్తుంటే... వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిన చందంగా ఉంది. జీడిమెట్ల, పటాన్‌చెరు, రామచంద్రపురంలలో ఫార్మా కంపెనీలు ఎవరి హయాంలో వచ్చాయి? వారి పాలనలో నాశనం చేసి ఇప్పుడు కాలుష్యం గురించి మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంది. ఫార్మా కాలుష్యాన్ని పెంచిందే కాంగ్రెస్‌ పార్టీ. 

- రాష్ట్ర మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నగరాలు, పట్టణాల్లో భూసమస్యలు లేకుండా చేస్తామని పురపాలక మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ను భూవివాదాలు, భూసమస్యలు లేని నగరంగా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. భూములు, ఆస్తులపై ప్రజలకు యాజమాన్య హక్కు ఉండాలనే లక్ష్యంతోనే వ్యవసాయేతర భూములను ధరణిలోకి ఎక్కిస్తున్నామన్నారు. వ్యవసాయేతర భూములను ఆన్‌లైన్‌లో ఎక్కించే క్రమంలో చిత్రవిచిత్రమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. స్థిరాస్తికి సంబంధించిన చిక్కులన్నీ తొలగించి, ప్రజలకు స్థిరాస్తిపై న్యాయబద్ధమైన హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మంగళవారం శాసనసభలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌  చట్ట సవరణ బిల్లుపై ఆయన మాట్లాడారు. బుధవారం హైదరాబాద్‌లో ధరణిపై ప్రత్యేక సమావేశం జరుగనుందని, ఆ సమావేశంలోనే అన్ని అంశాలు చర్చిస్తామని ప్రకటించారు. ప్రజాప్రతినిధులకు సహాయంగా ఉండే విధంగా వార్డు కమిటీల పాత్ర ఉంటుందని చెప్పారు.


వార్డు కమిటీలకు రాజకీయాలకు ఆతీతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. వార్డుల్లో, డివిజన్‌లలో చురుగ్గా ఉండే వ్యక్తుల ప్రాతినిధ్యంతో కమిటీలు ఉంటాయన్నారు. ఒకసారి ఎన్నికైతే ఐదేళ్ల పాటు పనిచేసేలా వార్డు కమిటీల ఏర్పాటు ఉంటుందని చెప్పారు. ఈ కమిటీల సలహాలు, సూచనలను మున్సిపల్‌ కౌన్సిల్లో చర్చిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతోనే వార్డు కమిటీలు వేస్తున్నామని, చట్టంలో నాలుగు రకాల వార్డు కమిటీలు పెట్టామని చెప్పారు. ఒక్కో కమిటీలో 25 మంది సభ్యులు ఉంటారని, అందులో సగం మంది మహిళలు ఉంటారని తెలిపారు. యువజనులు, వృద్ధులు, మహిళలు, ప్రముఖ పౌరులతో నాలుగు రకాల కమిటీలు ఉంటాయన్నారు. ప్రతీ డివిజన్‌లో 100 మంది చొప్పున 15 వేల మందితో ప్రజా సైన్యాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. గ్రీన్‌ కవర్‌, అనధికార నిర్మాణాలను అడ్డుకోవడం, పార్కుల ఆక్రమణను అరికట్టడం, క్రీడలు, ప్లాస్టిక్‌ను తగ్గించడం వంటి పనులను వార్డు కమిటీలు  చేస్తాయన్నారు.


బీఆర్‌ఎ్‌సపై స్టే తొలగించే ప్రయత్నాలు

బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(బీఆర్‌ఎ్‌స)పై హైకోర్టులో స్టే ఉందని, దాన్ని తొలగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎ్‌సలో కూడా 12 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయన్నారు.  ‘‘429 ఏళ్ల కిందట హైదరాబాద్‌ ఏర్పడింది. మహా నగరంగా మారింది. 1869లో మున్సిపాల్టీగా మారింది. 1933లో చాదర్‌ఘాట్‌ పేరు మున్సిపాల్టీ, 1937లో జూబ్లీహిల్స్‌ మున్సిపాల్టీ, 1945లో సికింద్రాబాద్‌ మున్సిపాల్టీ ఏర్పడ్డాయి. ఇవన్నీ కలిసి 1955లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడింది. ఆ తర్వాత 60 ఏళ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా, ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా చేయడానికి ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నాలు జరగలేదు. అందుకే, జీహెచ్‌ఎంసీ చట్టంలో ఐదు సవరణలు తెస్తున్నాం. 2015లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతున్నప్పుడే కార్యనిర్వాహక ఉత్తర్వు రూపంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాం.


79 స్థానాల్లో మహిళలను గెలిపించుకున్నాం. తెలంగాణలో పచ్చదనం 5-6 శాతం పెరిగిందని నివేదిక వచ్చింది. కొత్త పురపాలక, పంచాయతీ రాజ్‌ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్‌ కవర్‌కు పెట్టాలని పొందుపరిచాం. గతంలో 2.5 శాతమే గ్రీన్‌ బడ్జెట్‌కు పెట్టేవారు. ప్రజాప్రతినిధులు, అధికారులకు జవాబుదారీతనం పెంచడానికి, నాటిన మొక్కలు 85 శాతం బతకాలని షరతు విధించాం. ఎన్నికలు తేదీలను ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి, నిర్వహించేలా చట్టంలో మార్పులు చేశాం’’ అన్నారు. 


వార్డు కమిటీలకు ప్రాతిపదిక ఏంటి: భట్టి 

వార్డు కమిటీలకు ఏ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తారని కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని నిలదీశారు. 1994లో ఎన్టీఆర్‌ బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని ప్రస్తావించారు. సుప్రీంకోర్టులో ఉన్న కేసును పట్టించుకొని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే 52 శాతం రిజర్వేషన్లు వచ్చేవన్నారు. పర్యావరణానికి ఇబ్బంది కలుగకుండా ఫార్మా కంపెనీలకు అనుమతినివ్వాలని ఎమ్మెల్యే అనసూయ ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లాలో 26 వేల ఎకరాలను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ నిషేధిత జాబితాలో చేర్చారని, ఇందులో 90 శాతానికి పైగా స్థలాల్లో నిర్మాణాలు వచ్చాయని చెప్పారు. ఈ ఇళ్లకు బిల్డింగ్‌ ఫీజు వసూలు చేసుకున్నా రూ.1000 కోట్ల దాకా ప్రభుత్వానికి వచ్చేవన్నారు.  


ఫార్మా కాలుష్యం పెంచిందే కాంగ్రెస్‌

ఫార్మా కంపెనీలు, జీడిమెట్ల, పటాన్‌చెరు, రామచంద్రపురం పారిశ్రామిక వాడలు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ‘‘కాలుష్యం అంతా వారి హయాంలో తెచ్చి, నాశ నం చేసి, ఇవాళ ఇది బాగా లేదు.. అది బాగా లేదు అనడమే బాగాలేదు. కాలుష్యం గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉం ది. ఫార్మా కాలుష్యం పెంచిందే కాంగ్రెస్‌ పార్టీ’’ అని మండిపడ్డారు.

Updated Date - 2020-10-14T07:37:55+05:30 IST