‘గులాబీ’ జెండా ఎగరాలి

ABN , First Publish Date - 2021-01-16T06:49:31+05:30 IST

త్వరలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో ‘గులాబీ’ జెండా

‘గులాబీ’ జెండా ఎగరాలి

మండలి, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మెజారిటీ సాధించాలి

క్షేత్ర స్థాయిలో దూసుకెళ్లండి

విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

సోషల్‌ మీడియాను వినియోగించండి

నేతల మధ్య సమన్వయం తప్పనిసరి: కేటీఆర్‌

ఉమ్మడి వరంగల్‌జిల్లా పార్టీ నేతలతో భేటీ

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష


హైదరాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) ఎన్నికల్లో ‘గులాబీ’ జెండా ఎగరాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ రెండు ఎన్నికల్లోనూ పార్టీ పట్టును నిలబెట్టుకోవాలని, మరోసారి మెజారిటీ సాధించాలని చెప్పారు. శుక్రవారం ఇక్కడ తన క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మండలి, కార్పొరేషన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. కొంచెం అటు, ఇటుగా వీటి ఎన్నికలు ఎప్పుడు జరిగినప్పటికీ, టీఆర్‌ఎస్‌ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని వారిని ఆదేశించారు.


విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష జరిపారు. స్థానికంగా నెలకొన్న తాజా రాజకీయ స్థితిగతులను ఆరా తీశారు. అదే సమయంలో నియోజకవర్గాలకు సంబంధించి వివిధ సర్వే నివేదికల ప్రాతిపదికన తనవద్ద ఉన్న  సమాచారాన్ని వారితో పంచుకున్నారు. అందుకు అనుగుణంగా ఎక్కడికక్కడ చేపట్టాల్సిన దిద్దుబాటు చర్యలను వివరించారు. పట్టభద్రుల ఓటర్ల జాబితాను వారికి అందజేశారు. మండలి ఎన్నికలకు సంబంధించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే రంగంలోకి దిగాలని వారికి స్పష్టంచేశారు. ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లతో సమావేశాలు పెట్టాలని, క్షేత్రంలో దూసుకువెళ్లాలని నిర్దేశించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గడిచిన ఆరున్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లాలని చెప్పారు. టీఆర్‌ఎ్‌సపై విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలన్నారు. మండలి ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగవచ్చని అన్నారు. అయినప్పటికీ కార్పొరేషన్‌ పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు (వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌ తూర్పు, స్టేషన్‌ఘన్‌పూర్‌, పరకాల) ఇప్పటి నుంచే సీరియ్‌సగా పని ప్రారంభించాలని చెప్పారు. పార్టీ తరఫున మండలి, కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో సోషల్‌ మీడియాను సమర్థంగా వాడుకోవాలని, ఇందుకు పార్టీ సోషల్‌ మీడియా ఆర్మీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోషల్‌ మీడియా కార్యకర్తలతోనూ సమావేశాలను నిర్వహించుకోవాలని చెప్పారు. పార్టీ నేతలందరినీ కలుపుకొని వెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. ఎక్కడైనా నాయకుల మధ్య అంతర్గత కలహాలు ఉంటే, మంత్రులు చొరవ తీసుకొని సర్దుబాటు చేయాలని, పార్టీకి నష్టం కలగకుండా చూడాలన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల మధ్య సమన్వయ బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు.      


అభ్యర్థి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డే!

వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల మండలి నియోజకవర్గం ఎన్నికల్లో పార్టీ తరఫున సిటింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సూచనప్రాయంగా చెప్పారని తెలిసింది. అభ్యర్థి ఎంపికపై టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని తెలిపినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.


నేడు సాగర్‌ ఉప ఎన్నికపైనా సమీక్ష

ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలతో శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపైనా సమీక్ష చేపట్టనున్నారు. ఆదివారం లేదా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ అవుతారని సమాచారం. కానీ, ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి వరకు ఆ జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిసింది.

Updated Date - 2021-01-16T06:49:31+05:30 IST