ఏపీ సీఎం జగన్‌తో మంచిగనే ఉన్నం.. అయితే.. : మంత్రి కేటీఆర్

ABN , First Publish Date - 2020-08-09T23:39:34+05:30 IST

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు ట్విటర్ వేదికగా...

ఏపీ సీఎం జగన్‌తో మంచిగనే ఉన్నం.. అయితే.. : మంత్రి కేటీఆర్

హైదరాబాద్: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం నాడు ట్విటర్ వేదికగా ‘ASK KTR’ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమిచ్చారు. కళాశాలలు పున: ప్రారంభించిన తర్వాత సెమిస్టర్ పరీక్షలతో పాటు వాయిదా పడిన పరీక్షలు కూడా నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని వస్తున్న వార్తలపై స్పష్టత ఇవ్వగలరని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రా రెడ్డి గారితో సంప్రదించి తిరిగి వెల్లడిస్తామని కేటీఆర్ సమాధానమిచ్చారు.


రాష్ట్రానికి కొన్ని భారీ పెట్టుబడులు రానున్నాయని, త్వరలో ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. ఏపీ సీఎం జగన్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అయితే.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.


పోతిరెడ్డిపాడుపై మీ వైఖరి ఏంటని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. కృష్ణా జలాల్లో న్యాయం మనకు చెందాల్సిన వాటా కోసం పోరాడుతున్నామని, ఇప్పటికే సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. రాజకీయ నేతల్లో కేసీఆర్ కాకుండా మీకు నచ్చిన నేత ఎవరని అడగ్గా.. ఒబామా అని కేటీఆర్ సమాధానమిచ్చారు. కరోనా టెస్టుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ఎందుకు వెనుకబడి ఉందని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ.. రోజుకు దాదాపు 23వేల టెస్టులు చేస్తున్నామని, త్వరలో ఈ సంఖ్యను 40వేలకు పెంచబోతున్నామని చెప్పారు. 1200కు పైగా సెంటర్స్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.


తెలంగాణలో కరోనా మరణాల రేటు 1 శాతం కంటే తక్కువగానే ఉందని, 72 శాతం రికవరీ రేటుతో దేశంలోనే కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఎంఎంటీస్, సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయని ఓ నెటిజన్ అడగ్గా.. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు మంత్రి చెప్పారు.

Updated Date - 2020-08-09T23:39:34+05:30 IST