పారిశుద్ధ పనుల నిర్వహణలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీఆర్

ABN , First Publish Date - 2021-12-13T21:17:21+05:30 IST

నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే జీహెచ్ఎంసి పరిధిలో ఎంతో మెరుగైన పారిశుద్ధ్యం జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు.

పారిశుద్ధ పనుల నిర్వహణలో రాజీపడే ప్రసక్తే లేదు: కేటీఆర్

హైద‌రాబాద్: నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే జీహెచ్ఎంసి పరిధిలో ఎంతో మెరుగైన పారిశుద్ధ్యం జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నగరంలో సోమవారం స్వ‌చ్ఛ ఆటోల‌ను మంత్రి కేటీఆర్ ప‌చ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసి పరిధిలో పచ్చదనంతో పాటు, పారిశుద్ధ్యం సరిగ్గా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. జంటనగరాలను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు సీఎం కేసీఆర్ స్వ‌యంగా 2500 స్వ‌చ్ఛ ఆటోల‌ను ప్రారంభించి స్వ‌చ్ఛ హైద‌రాబాద్ – స్వ‌చ్ఛ తెలంగాణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారని చెప్పారు. 


గ‌త ఐదారు సంవ‌త్స‌రాల నుంచి కేంద్రం ప్ర‌క‌టించే స్వ‌చ్ఛ భార‌త్, స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ ర్యాంకింగ్స్‌లో ఉత్తమ న‌గ‌రంగా హైద‌రాబాద్ నిలుస్తూ వ‌స్తుంద‌న్నారు. ఎక్క‌డికక్క‌డ‌, ఎప్ప‌టిక‌ప్పుడు న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు శ్ర‌మిస్తున్న మున్సిప‌ల్ సిబ్బందికి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.న‌గ‌రంలో 2500 ఆటో టిప్ప‌ర్లు ప్ర‌వేశ‌పెట్ట‌క‌ముందు 3500 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్ప‌త్తి అయ్యేది. ఈ ఆటో టిప్ప‌ర్లు ఇంటింటికీ తిరిగి చెత్త సేక‌రించ‌డం వ‌ల్ల‌ 6500 మెట్రిక్ ట‌న్నుల చెత్త ఉత్ప‌త్తి అవుతోంది. 


మొత్తంగా చెత్త‌ను డంప్ యార్డుల‌కు త‌ర‌లిస్తున్నారని మంత్రి తెలిపారు. సోమవారం ప్రారంభించిన 1350 వాహ‌నాల‌తో క‌లిపితే 5750 పైచిలుకు వాహ‌నాలు జీహెచ్ఎంసీలో అందుబాటులో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతిపెద్ద‌దైన వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్‌ను జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్‌లో 20 మెగావాట్ల సామ‌ర్థ్యంతో ప్రారంభించుకున్నామని తెలిపారు. మ‌రో 28 మెగావాట్ల ప్లాంట్‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ల‌భించాయన్నారు. ఈ ప్లాంట్ నిర్మ‌ణ ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌న్నారు. 

Updated Date - 2021-12-13T21:17:21+05:30 IST