రేవంత్‌రెడ్డికి దమ్ముంటే డిపాజిట్‌ తెచ్చుకోవాలి: కేటీఆర్ సవాల్

ABN , First Publish Date - 2021-10-19T16:30:29+05:30 IST

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డికి దమ్ముంటే డిపాజిట్‌ తెచ్చుకోవాలి: కేటీఆర్ సవాల్

హైదరాబాద్: హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా గెలుస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దమ్ముంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాల్ చేశారు. హుజురాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. ఈటల రాజేందర్ కోసమే కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. త్వరలో ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదన్నారు. కాంగ్రెస్‌లో భట్టిది నడవట్లేదని.. అక్రమార్కులదే నడుస్తోందన్నారు. వివేక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని తెలుస్తోందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.


తెలంగాణలో 15 రోజుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కరోనాతో పార్టీ కార్యక్రమాలు ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. నవంబర్‌ 15న ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఆ రోజు 7 వేల ఆర్టీసీ బస్సులు తీసుకుంటామని, వరంగల్ తమకు కలిసొచ్చిన జిల్లా అని.. అక్కడ ఏసభ అయినా విజయవంతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు. అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. త్వరలో అన్ని స్థాయిల నాయకులకు శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. 6 నుంచి 9 నెలల వరకు శిక్షణ తరగతులు ఉంటాయని, ముందస్తు ఎన్నికల కోసం పార్టీ కార్యక్రమాలు అనుకోవడం తప్పన్నారు. పార్టీగా.. ప్రభుత్వంగా సాధించిన విజయాలు నెమరువేసుకుంటామన్నారు. 20ఏళ్లుగా ఓ పార్టీ మనుగడ సాధించడం చాలా గొప్ప అన్నారు. 1956 తర్వాత ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ, కేసీఆర్ పెట్టిన టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే నిలదొక్కుకున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-19T16:30:29+05:30 IST