స్వయానా మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా ఎవరూ పట్టించుకోరేం..!?

ABN , First Publish Date - 2021-06-24T19:19:09+05:30 IST

ఈ ఘటన జరిగిన రెండు, మూడు రోజులకే మంత్రి కే తారక రామారావు స్పందించారు...

స్వయానా మంత్రి కేటీఆర్‌ ఆదేశించినా ఎవరూ పట్టించుకోరేం..!?

  • ప్రతిపాదనలు 310 కి.మీలు.. 
  • చేసిన పనులు 16.55 కిలోమీటర్లు
  • శ్లాబ్‌ల ఏర్పాటు.. చాలా లేటు
  • నత్తనడకన డ్రెయిన్‌ పైకప్పుల నిర్మాణం
  • ఏడాది కావస్తున్నా అంతంతే
  • జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం
  • పట్టించుకోని ఉన్నతాధికారులు
  • రూ.300 కోట్ల నిధులు గతంలోనే మంజూరు
  • అయినా పనుల్లో కనిపించని పురోగతి

హైదరాబాద్‌ సిటీ : ఏడాది క్రితం భారీ వర్షంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ బాలిక నేరేడ్‌మెట్‌లోని ఓపెన్‌ డ్రెయిన్‌లో పడి మృతి చెందింది. వరద ప్రవాహం అధికంగా ఉండడంతో రోడ్డు ఏది, డ్రెయిన్‌ ఏదన్నది తెలియక చిన్నారి అసువులు బాసింది. ఈ ఘటన జరిగిన రెండు, మూడు రోజులకే మంత్రి కే తారక రామారావు స్పందించారు. గ్రేటర్‌లోని ఓపెన్‌ డ్రెయిన్‌లకు శ్లాబ్‌లు నిర్మించాలని, ఇందుకోసం రూ.300 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. నిధుల మంజూరుకు సంబంధించి ఉత్తర్వులూ జారీ అయ్యాయి.


ఆగమేఘాల మీద క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు నివేదిక ఇచ్చారు. 310 కి.మీలకు పైగా ఓపెన్‌ డ్రెయిన్ల శ్లాబ్‌ల నిర్మాణానికి రూ.300 కోట్లు ఖర్చవుతాయని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రాథమిక అంచనాల ఆధారంగా పురపాలక శాఖ పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఘటన జరిగి, కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేసి దాదాపు ఏడాది కావస్తోంది. మళ్లీ మాన్‌సూన్‌ మొదలైంది. అడపాదడపా వర్షాలూ కురుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు పూర్తయ్యింది మాత్రం 16 కి.మీలు మాత్రమే. ఈ లెక్కన పూర్తిస్థాయిలో శ్లాబ్‌ల ఏర్పాటుకు ఎన్నేళ్లు పడుతుందన్నది అధికారులకే తెలియాలి. ఘటన జరిగినప్పుడు అలవాటులో భాగంగా హడావిడి చేసే అధికారులు అనంతరం అసలు విషయాన్ని విస్మరిస్తున్నారు. రహదారులపై గుంతలు పూడ్చడం నుంచి నాలాలపై శ్లాబ్‌లు వేయడం వరకూ అదే తీరు.


రోడ్డు ఏదో, డ్రెయిన్‌ ఎక్కడో...

గ్రేటర్‌లో 1400 కి.మీల మేర నాలాలున్నాయి. ఇందులో 700 కి.మీల మేర ఇప్పటికే శ్లాబ్‌లు ఉండగా 300 కి.మీల మేర ఉన్న భారీ నాలాలకు పై కప్పులు వేయాల్సిన అవసరం ఉండదు. వీటిలో చాలా వరకు ఇరు వైపులా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. కాలనీలు, బస్తీల్లో జనావాసాల మధ్య ఉన్న ఓపెన్‌ డ్రెయిన్లకు కొన్ని చోట్ల శ్లాబ్‌లు లేవు. ఇవే వర్షాకాలంలో ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. కిందటి ఏడాదే కాకుండా గతంలోనూ ప్రమాదాలు జరిగాయి. అయినా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడడం లేదు. భారీ వర్షాలు కురిసినప్పుడు నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులపై వరద ఏరులై పారుతోంది. ఈ క్రమంలో రోడ్డు ఏదో, డ్రెయిన్‌ ఎక్కడుందో తెలియక ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓపెన్‌ డ్రెయిన్లలో ప్రమాదవశాత్తు పడితే వరద ఉధృతికి దిగువకు కొట్టుకుపోతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఈ తరహా ప్రమాదాలకు గురవుతున్నారు. 


అయినా ఆలస్యం...

మెజార్టీ ప్రాంతాల్లో ఓపెన్‌ డ్రెయిన్లలో ప్రీ కాస్ట్‌ శ్లాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు అన్ని సర్కిళ్లలోనూ టెండర్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని ఉన్నతాధికారొకరు చెప్పారు. అయితే పనులు మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రీ కాస్ట్‌ విధానంలో పనులు వేగంగా చేసే అవకాశం ఉన్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

Updated Date - 2021-06-24T19:19:09+05:30 IST