Abn logo
Oct 14 2021 @ 02:37AM

25న టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడి ఎన్నిక

  • అదే రోజు హెచ్‌ఐసీసీలో ప్లీనరీ
  • అధ్యక్ష పదవికి 17 నుంచి నామినేషన్ల స్వీకరణ
  • 17న ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమావేశం
  • వచ్చేనెల 15న వరంగల్‌లో విజయగర్జన సభ
  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి నియామకం మాత్రమే
  • హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పెద్ద విషయం కాదు
  • మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధ్యక్ష పదవికి ఈ నెల 25న ఎన్నిక జరగనుంది. అదేరోజు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భారీ ఏర్పాట్లతో ప్లీనరీ నిర్వహిస్తామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ నెల 17నే అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 17 నుంచి 22వ తేదీ వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, 23న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ, 25న పార్టీ సర్వసభ్య సమావేశం ఉంటాయని వివరించారు. సర్వసభ్య సమావేశంలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నట్లు చెప్పారు. ఈ అంశాలపై కేటీఆర్‌ బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 


ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిందని, బస్తీ, గ్రామ, మండల, అనుబంధ కమిటీల ఎన్నికలు పూర్తయ్యాయని వెల్లడించారు. 12,769 గ్రామాల్లో కమిటీలు వేసినట్లు చెప్పారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని తెలిపారు. పార్టీ బై లా ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ప్లీనరీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికలు, కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఈ ప్రక్రియను నిర్వహించలేదని పేర్కొన్నారు. ఈసారి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు 14 వేల మంది ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎన్నిక ప్రక్రియకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివా్‌సరెడ్డి వ్యవహరిస్తారని, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని సీనియర్‌ నాయకుడు కృష్ణమూర్తి, జనరల్‌ సెక్రటరీ సోమ భరత్‌ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. ఎన్నిక పూర్తయ్యాక పార్టీ అధ్యక్షుడు టీఆర్‌ఎస్‌ నాయకులలు, శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ప్లీనరీ తీర్మానాల కమిటీ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ నెల 17న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, సీఎ కేసీఆర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 


14 ఏళ్ల ఉద్యమం.. ఏడేళ్ల పాలన

14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఏడేళ్ల పాలనలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్థిని మననం చేసుకోవాల్సి ఉందని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని, స్వరాష్ట్రాన్ని సాధించామని పేర్కొన్నారు. ప్రస్తుతం అద్భుతమైన విధానాలతో పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబరు 15న వరంగల్‌లో నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ విజయగర్జన పేరుతో జరిగే ఈ సభకు సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల్లో ఈ నెల 27న నిర్వహిస్తామని చెప్పారు. రెండు దశాబ్దాలు, రెండు పర్యాయాల అధికారంపై విజయగర్జన ద్వారా దేశం మొత్తానికి టీఆర్‌ఎస్‌ విజయాన్ని చాటి చెబుతామన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నది కేవలం నియామకమేనని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేటీఆర్‌ చెప్పారు. ఇప్పటివరకు ఎన్నిక జరగలేదన్నారు. ఈ అంశంపై ఎక్కువగా వివరాలు చెప్పేందుకు ఆయన ఇష్టపడలేదు. 


‘హుజూరాబాద్‌’ చర్చనీయాంశం కాదు

హుజురాబాద్‌ ఉప ఎన్నిక అంశం తమకు ఏమంత పెద్ద విషయం కాదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తాము ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించామన్నారు. హుజురాబాద్‌ ఎన్నిక ప్రచారంపై మరోసారి మాట్లాడుతామన్నారు. అయితే, అది అంత సీరియస్‌ విషయం, చర్చనీయాంశం కాదని వ్యాఖ్యానించారు. ప్రచారానికి సంబంధించి పార్టీ పెద్దల షెడ్యూల్‌ ఖరారయ్యాక మీడియాకు వెల్లడిస్తామన్నారు. 

క్రైమ్ మరిన్ని...