Abn logo
Aug 23 2021 @ 00:34AM

అమాత్యులనోట అవాస్తవాలా?

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తొలి దశ పనులు పురోగతిలో ఉన్నాయన్న మంత్రి కన్నబాబు 

స్వాతంత్య్ర దినోత్సవ సభలో జాతీయ జెండా సాక్షిగా వెల్లడి

క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా పరిస్థితి

25 నెలల నుంచి ఒక్క అడుగు కూడా కదలని ప్రాజెక్టు పనులు

తొలి దశ పనులకు రూ.2,022 కోట్లు... బడ్జెట్‌లో కేటాయించింది రూ.79 కోట్లు!

ప్రకటనలకే పరిమితమైన భూసేకరణ

అనకాపల్లిలో కార్యాలయం... వసతి లేకపోవడంతో విశాఖలో ఏర్పాటు

ఎస్‌డీసీ మినహా మరెవరీని నియమించని ప్రభుత్వం

నిధులు, సిబ్బంది లేకుండా భూసేకరణ ఎలా సాధ్యమంటున్న అధికారులు


(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి): ‘‘బాబూ జగ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు అందుతుంది. ఒక్క విశాఖ జిల్లాలోనే 3.25 లక్షల ఎకరాల ఆయకట్టు వుంటుంది. ప్రాజెక్టు తొలి దశకు రూ.2,022 కోట్లతో పాలనామోదం రాగా పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే జిల్లాలో 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండో దశపనులు కూడా పురోగతిలో ఉన్నాయి’’

- 75వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు


అమాత్యుల ప్రసంగం విన్న వారికి, పత్రికల్లో వార్తలు చూసిన వారికి ఇదంతా నిజమే అనిపిస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా వుంది. తొలి దశ పనులు పురోగతి మాట అటుంచి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు ఒక్క తట్ట మట్టికూడా తీయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2019 జూన్‌లో కాంట్రాక్టర్‌ పనులు ఆపేశారు. అప్పటి నుంచి తిరిగి మొదలు పెట్టలేదు. భూసేకరణ ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది. మంత్రి కన్నబాబు మాటలతో ప్రాజెక్టు తొలిదశ నిర్మాణం జరిగే కశింకోట, బుచ్చెయ్యపేట, రావికమతం మండలాల రైతులు విస్తుపోతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. జిల్లా ప్రజలను భ్రమల్లో ఉంచొద్దని అన్నదాతలు హితవు పలుకుతున్నారు.


కదలని భూసేకరణ

సుజల స్రవంతి ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల పరిధిలో 30 వేల ఎకరాలను సేకరించాలి. తొలి దశలో రెండు ప్యాకేజీలకు 4,400 ఎకరాలు అవసరం. రెండో దశలో ఆరు ప్యాకేజీలకు మరో 25,600 ఎకరాలు సేకరించాలి. తొలిదశలో విశాఖ జిల్లాలో పెదపూడి రిజర్వాయర్‌కు 1,300 ఎకరాలు, ప్రధాన కాలువలకు 300 ఎకరాలు, పిల్లకాలువలకు 1,653 ఎకరాలు, మధ్యలో ఉన్న అటవీభూమి 147.63 ఎకరాలు వెరసి 4,400 ఎకరాలు అవసరమని అధికారులు గతంలోనే ప్రతిపాదించారు. సేరించాల్సిన వాటిలో  కశింకోట, బుచ్చెయ్యపేట, మాకవరపాలెం, నర్సీపట్నం, రావికమతం మండలాల్లో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి. వీటిల్లో 2,300 ఎకరాలకు రెండేళ్ల క్రితమే ల్యాండ్‌ప్లాన్‌ షెడ్యూల్స్‌ రూపొందించారు. ఇందులో 1,300 ఎకరాలకు ప్రాథమిక ప్రకటన జారీచేశారు తప్ప అవార్డు (నష్టపరిహారం) ప్రకటించలేదు. కొన్నిచోట్ల రైతుల నుంచి సానుకూలత రాకపోవడంతోపాటు ప్రధానంగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో భూసేకరణ ముందుకు కదలడంలేదు. 


బడ్జెట్‌లో రూ.79 కోట్లు కేటాయింపు

కాగా సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించి మూడు జిల్లాల్లో భూములకు నష్టపరిహారంతోపాటు రిజర్వాయర్‌ల నిర్మాణం, కాలువల తవ్వకం పనులు, ఇతర కట్టడాలకు రూ.17,411 కోట్లతో అంచనాలను రూపొందించారు. రెండు దశల్లో ఎనిమిది ప్యాకేజీలుగా పనులు విభజించి, మూడేళ్లలో పూర్తిచేస్తామని గత ఏడాది నుంచి పాలకులు చెబుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.79 కోట్లు మాత్రమే కేటాయించారంటే సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వైసీపీ పాలకులకు ఎంత చిత్తశుద్ధి వుందో అర్థం అవుతున్నదని రైతులు అంటున్నారు. 


25 నెలలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

సుజల స్రవంతి తొలి దశ పనులకు ప్రభుత్వం రూ. 2,022 కోట్లతో పాలనామోదం ఇచ్చింది. టీడీపీ హయాంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కే అప్పగించింది. అయితే 2018 చివరలో పనులు మొదలుపెట్టిన మరుసటి ఏడాది మే నెలలో పనులు ఆపేశారు. అంతవరకు సుమారు తొమ్మిది కోట్ల రూపాయల విలువైన పనులు చేసినట్టు తెలిసింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌గా రూ.1.5 కోట్లు, ప్యాకేజీ-1లో రూ.3.03 కోట్లు, ప్యాకేజీ-2కి అవసరమైన ఇన్వెస్టిగేషన్‌ కోసం రూ.67 లక్షలు విడుదల చేయగా, ఇంకా రూ.2.6 కోట్లు చెల్లించాల్సి వుంది. ఈ బకాయిలు చెల్లించడంతోపాటు భూసేకరణ పూర్తయితే పనులు మొదలు పెట్టడానికి కాంట్రాక్టర్‌ సిద్ధంగా వున్నట్టు తెలిసింది. వాస్తవ పరిస్థితి ఇలా వుండగా... మంత్రి కన్నబాబు జాతీయ జెండా సాక్షిగా ‘ప్రాజెక్టు తొలి దశ పనులు జరుగుతున్నాయని, రెండో దశపనులు కూడా పురోగతిలో ఉన్నాయి’ అని చెప్పడం విడ్డూరంగా వుంది.


పేరు అక్కడ... కార్యాలయం ఇక్కడ

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు భూసేకరణ కోసం అనకాపల్లి, చోడవరం, ఎస్‌.కోటల్లో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయాలను ప్రభుత్వం మంజూరు చేసింది.  అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌గా సీనియర్‌ అధికారి పద్మలతను నియమించారు. కానీ కార్యాలయానికి భవనం సమకూర్చలేదు. ఎస్‌డీసీ మినహా మరే ఇతర అధికారులనుగానీ, సిబ్బందినిగానీ నియమించలేదు. అనకాపల్లిలో వసతి లేకపోవడంతో నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయ ప్రాంగణంలో వున్న ఒక ఉద్యోగి క్వార్టర్‌ కేటాయించారు. ఫర్నిచర్‌, సిబ్బందిని ఏర్పాటు లేదు.