రాజీనామాకు సిద్ధమా?.. గవర్నర్‌కు మంత్రి సవాల్

ABN , First Publish Date - 2020-07-09T16:38:38+05:30 IST

గవర్నర్‌ కిరణ్‌ బేదీ తన పదవికి రాజీనామా చేస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు సవాలు

రాజీనామాకు సిద్ధమా?.. గవర్నర్‌కు మంత్రి సవాల్

చెన్నై: గవర్నర్‌ కిరణ్‌ బేదీ తన పదవికి రాజీనామా చేస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని పుదుచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు సవాలు విసిరారు. పుదుచ్చేరిలో విలేకరులతో మాట్లాడుతూ, గవర్నర్‌ కార్యదర్శి పదవి రెండేళ్ల నుంచి ఖాళీగా వుందని, ప్రభుత్వ శాఖల్లోని అన్ని పదవులను భర్తీ చేయాలని చెబుతున్న గవర్నర్‌ తన కార్యదర్శి పదవిని మాత్రం ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. రాజ్‌నివాస్‌లో పనిచేస్తున్న ఓ మహిళా అధికారి ఓ ఏజెంట్‌ కోరిన విధంగా పనులు చేసి నాలుగేళ్లలో కోట్లాది రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రతి విష యంలోను సీబీఐ విచార ణకు చేపడతామని పే ర్కొంటున్న గవర్నర్‌, ఆ మహిళా అధికారి వ్యవహా రంపై ఎందుకు సీబీఐ విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజ్‌నివాస్‌లో స్వచ్ఛత లేదని, అది గవర్నర్‌కు తెలిసే జరుగుతుందనే అనుమానం ఉందన్నారు. ప్రజాసంక్షేమ నిధులను కూడా గవర్నర్‌ ఖర్చు చేస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తాను 31 ఏళ్లుగా రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నానని, రెండేళ్ల అనంతరం ఒక్కరోజు కూడా తాను పుదుచ్చేరిలో వుండనని గవర్నర్‌ ప్రకటించారని మంత్రి గుర్తుచేశారు. గవర్నర్‌ తన పదవికి రాజీనామా చేస్తే, తాను తన పదవికి రాజీనామా చేయడంతో పాటు, రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఎన్నికల్లో కూడా పోటీచేయబోనని మంత్రి సవాలు విసిరారారు. నా సవాలును స్వీకరించేందుకు గవర్నర్‌ సిద్ధమా అని ప్రశ్నించారు. గవర్నర్‌ అడ్డుకుంటున్న ప్రజా సంక్షేమ పథకాల అమలుకు కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-09T16:38:38+05:30 IST