వాహనమిత్ర ద్వారా.. రూ.10 వేలు

ABN , First Publish Date - 2020-06-05T09:27:30+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 24,056 మందికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం విడుదల చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ..

వాహనమిత్ర ద్వారా.. రూ.10 వేలు

జిల్లాలో 24,056 ఆటో కార్మికులకు లబ్ధి

నాలుగు నెలల ముందుగానే రెండో ఏడాది చెల్లింపు

కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి మోపిదేవి  


గుంటూరు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలో 24,056 మందికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం విడుదల చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. గురువారం ఈ పథకం రెండో ఏడాది నగదు చెల్లింపుల కార్యక్రమం కలెక్టరేట్‌లో జరిగింది. అంతకంటే ముందు సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపుని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి మాట్లాడుతూ గత ఏడాది 20,977 మంది ఆటో కార్మికలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని, అయితే వారిలో ప్రస్తుతం 19,857 మంది అర్హులుగా తేలారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నూతనంగా 4,199 మంది అర్హత పొందారని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన ఆటో, క్యాబ్‌ డ్రైవర్లను ఆదుకునేందుకు నాలుగు నెలలు ముందుగానే సీఎం జగన్‌ రెండో ఏడాది నగదు చెల్లింపులు చేయడం అభినందనీయమన్నారు.


ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే వెంటనే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్పందన యాప్‌ ద్వారా కూడా అప్లికేషన్‌ పెట్టుకోవచ్చని తెలిపారు. సమస్యలు ఉంటే స్పందన హెల్ప్‌లైన్‌ నెంబరు 1902కు కాల్‌ చేయాలని సూచించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు వచ్చే నెల 4న ఆర్థికసాయం విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు అంబటి  రాంబాబు, కాసు మహేష్‌రెడ్డి, మహమ్మద్‌ ముస్తఫా, కిలారి వెంకట రోశయ్య, విడదల రజని, జేసీ(సచివాలయాలు) ప్రశాంతి, డీటీసీ మీరా ప్రసాదు, ఎంవీఐలు రాములు, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T09:27:30+05:30 IST