తెలంగాణలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది- మంత్రి నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-10T22:05:30+05:30 IST

తెలంగాణలో ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది- మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ అనుకూల విధానాలు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా వంటి పధ కాలు రైతులు ప్రోత్సాహకరంగా ఉన్నాయని చెప్పారు. సాగునీటి లభ్యత పెరగడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వానాకాలం పంటల సాగు, విత్తనాల లభ్యత పై నగరంలోని మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసం నుంచి రాష్ట్రంలోని అన్నిజిల్లాల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన జూమ్‌సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. 


తెలంగాణలో కంది 20లక్షల ఎకరాల్లోనూ, పత్తి 75లక్షల ఎకరాలు సాగు పెంచాలని సూచించారు.  వరి సాగుకాకుండా కంది , పత్తి సాగు మేలని చెప్పారు. అధికారులు రైతాంగాన్ని క్షేత్ర స్థాయిలో చైతన్యం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి సమావేశంలో వరిసాగు తగ్గించాలని రైతాంగానికి విజ్ఞప్తిచేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో నూనె గింజలకు మంచి డిమాండ్‌ ఉందని అన్నారు. విత్తన కంపెనీలు నూనె గింజల విత్తనాలను విస్తృతంగా రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వ్యవసాయ అధికారులు కూడా ఈవిషయాన్ని రైతుల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. రాబోయే రెండు నెలలు  వ్యవసాయశాఖ సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించాలని అన్నారు. 


కాగా నకిలీ విత్తన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 20లక్షల ఎకరాల్లో కంది సాగుకు అనుగుణంగా రాష్ట్ర, ఆతీయ విత్తనాభివృద్ధి సంస్థలు , వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇతర ప్రైవేట్‌ కంపెనీల ద్వారా 80వేల క్వింటాళ్ల కంది విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. దేశంలో తొలిసారి క్యూ ఆర్‌ కోడ్‌ , సీడ్‌ ట్రేసబులిటీతో నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మే 15 నాటికి అన్నిజిల్లాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు.అలాగే నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లను ఏర్పాటుచేసి అక్రమార్కులపై పీడీయాక్ట్‌ అమలుచేయాలన్నారు. ఇక పత్తిసాగు మీద జిల్లాల వారీగా సర్వేనిర్వహించి కార్యాచరణ ప్రణాళిక అందజేయాలని కూడా మంత్రి ఆదేశించారు. 

Updated Date - 2021-04-10T22:05:30+05:30 IST