చర్చలకు మీరు రండి.. నేను సిద్ధం!

ABN , First Publish Date - 2020-10-13T08:23:04+05:30 IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్సులు నడిపే అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చలు ..

చర్చలకు మీరు రండి.. నేను సిద్ధం!

1.61లక్షల కిలో మీటర్లే మా ప్రతిపాదన

శాశ్వత ప్రాతిపదికన ఒప్పందం ఉండాలి

ఏపీ మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన పువ్వాడ

‘ఆంధ్రజ్యోతి’కి వివరాలు వెల్లడించిన మంత్రి


హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్రాష్ట్ర బస్సులు నడిపే అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. చర్చలకు ఏపీ రవాణా శాఖ మంత్రి రావాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో ఏపీ బస్సులు 2.64 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతుండగా, ఏపీలో తెలంగాణ బస్సులు 1.61 లక్షల కిలోమీటర్లే తిరుగుతున్నాయి. అందుకే... ఏపీఎ్‌సఆర్టీసీ తన కిలో మీటర్లను తగ్గించుకోవాలని, తెలంగాణలో 1.61లక్షల కిలో మీటర్ల మేరకే బస్సులను తిప్పాలని టీఎ్‌సఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. దీనికి అంగీకరిస్తేనే ఒప్పందం చేసుకుంటామని ప్రకటించింది. ఈ అంశంపై అధికారుల మధ్య నాలుగు సార్లు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు.


ప్రస్తుతం పండుగల సీజన్‌ ఉన్నందున... బస్సులను ప్రారంభించాలన్న ఆలోచన ఇరు ఆర్టీసీలకు ఉంది. కానీ... ఈ వ్యవహారం ఎటూ తెగడం లేదు. అధికారుల మధ్య చర్చలు ముందుకు సాగకపోవడంతో మంత్రుల స్థాయిలోనే దీనికి పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి పువ్వాడ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ... ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీకి బస్సులు నడిపేందుకు టీఎ్‌సఆర్టీసీ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రకు బస్సులు ప్రారంభించామని, వాటితో ఎలాంటి పేచీ లేదని, ఏపీ మాత్రమే బెట్టు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తాను చర్చలకు సిద్ధమని, ఏపీ మంత్రి చర్చలకు రావాలని సూచించారు. ఇదే విషయాన్ని ఏపీ మంత్రి పేర్ని నానికి ఫోన్‌ చేసి చెప్పినట్లు వివరించారు. ఏపీ తన ద్వంద్వ వైఖరిని వీడి, 1.61 లక్షల కిలో మీటర్లకు వెంటనే అగ్రిమెంటు చేసుకోవాలని, . ఐదేళ్ల కాలానికి ఒప్పందం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అంగీకారమైతే వెంటనే చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.  

Updated Date - 2020-10-13T08:23:04+05:30 IST