యుద్ధరంగంలో ఉన్నాం.. రిలాక్స్‌ కావొద్దు

ABN , First Publish Date - 2021-04-02T10:29:31+05:30 IST

కరోనాతో అవిశ్రాంతంగా పోరాడే సమయమిది. వైద్య శాఖ సిబ్బంది అంతా ఇప్పుడు యుద్ధరంగంలో నెలకొన్న వాతావరణంలో పని చేస్తున్నారు.

యుద్ధరంగంలో ఉన్నాం.. రిలాక్స్‌ కావొద్దు

మందులు, పడకలు, సిబ్బంది కొరత లేకుండా చూడండి..

ఆస్పత్రుల సూపరింటెండెంట్ల సమావేశంలో ఈటల


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): కరోనాతో అవిశ్రాంతంగా పోరాడే సమయమిది. వైద్య శాఖ సిబ్బంది అంతా ఇప్పుడు యుద్ధరంగంలో నెలకొన్న వాతావరణంలో పని చేస్తున్నారు. ప్రజా జీవనాన్ని కొనసాగిస్తూనే కరోనాను నియంత్రించాల్సి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోని జిల్లాల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి గురువారం టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా మరణాలను అడ్డుకునేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని ఆస్పత్రుల్లో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు, లిక్విడ్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.


ఆస్పత్రుల్లో పడకల కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైతే వైద్యులు, సిబ్బందిని వెంటనే తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని సూచించారు. గ్రామాల్లో జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరిని, రోజూ పరిశీలించాలన్నారు. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారెవరూ సెలవులు పెట్టొద్దని కోరారు. ఆదివారం కూడా వ్యాక్సిన్‌ వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినందున అందరూ రోజూ పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో వాక్సిన్‌ కొరత లేదని, అందరికీ వాక్సిన్‌ అందుతుందని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ అన్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరినీ వాక్సిన్‌ సెంటర్‌కు పంపించాలని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య పెంచాలని, లక్ష్యం మేరకు పనిచేయాలన్నారు. 


కేసులు భారీగా పెరగొచ్చు.. 

రాష్ట్రంలో ప్రస్తుతం పాత వైర్‌సతోనే కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు అన్నారు. దేశ వ్యాప్తంగా వచ్చినట్లే మన వద్ద కూడా కొన్ని మ్యూటేషన్లు గుర్తించినప్పటికీ వాటి ప్రభావం అంతగా లేదన్నారు. కానీ ప్రజల అలసత్వం వల్ల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందన్నారు. ఈ నెల మూడో వారం నుంచి మే చివరి వరకు కేసుల సంఖ్య పతాక స్థాయిలో ఉంటాయన్నారు. ప్రస్తుతం వందల్లో నమోదవుతున్న కేసులు వేలల్లోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.


అత్యధిక మందిలో లక్షణాలు లేకుండానే వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్నారు. మరోవైపు చాలా మంది వైరస్‌ మాయమైందని అనుకుంటున్నారని, కానీ కరోనా వైరస్‌ కొత్త శక్తిని వృద్ధి చేసుకొని దాడి చేసేందుకు సిద్ధమవుతోందని డిహెచ్‌ హెచ్చరించారు. వైర్‌సను వేగంగా గుర్తించేందుకు రోజూ సగటున 50వేలకు పైగా టెస్టులు చేస్తున్నామన్నారు. సెకండ్‌ వేవ్‌లో యువత సైపర్‌ స్పైడర్లుగా మారే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో టెస్టులు చేయించుకోవాలన్నారు. 

Updated Date - 2021-04-02T10:29:31+05:30 IST