ఆ కొబ్బరి నీళ్లను సీఎం కేసీఆర్ తాగుతారా? జవదేకర్ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2020-11-22T18:48:47+05:30 IST

దుబ్బాక ఫలితాల్లో ఏం జరిగిందో... జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే రిపీట్ కాబోతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.

ఆ కొబ్బరి నీళ్లను సీఎం కేసీఆర్ తాగుతారా? జవదేకర్ సూటి ప్రశ్న

హైదరాబాద్: దుబ్బాక ఫలితాల్లో ఏం జరిగిందో... జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లోనూ అదే రిపీట్ కాబోతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. హైదరాబాదీలు కాంగ్రెస్‌కు, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే మతతత్వ ఎంఐఎంకు ఓటు వేసినట్లేనని, ఎంఐఎంకు ఓటు వేస్తే విభజన వాదానికి ఓటు వేసినట్లేనని ఆయన తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై ఆదివారం ఓ ఛార్జ్‌షీట్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులు అమాంతం పెరిగిపోతున్నాయని, అదే పేద ప్రజల ఆస్తులు రానూరానూ తరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు.  బీజేపీ మేయర్ కావాలో... ఎంఐఎం మేయర్ కావాలో హైదరాబాద్ ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. కేసీఆర్, ఓవైసీ లాంటి కుటుంబ పార్టీల నుంచి నగరాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కేవలం అక్బర్, అసదుద్దీన్ కోసమే రాజకీయాలు చేస్తున్నారని, కేసీఆర్ ఆరేళ్ల పాలన అవినీతికి చిరునామా అని మండిపడ్డారు.


హైదరాబాద్‌ను డల్లాస్ చేస్తామని ప్రకటించిన కేసీఆర్... చివరికి వరదల నగరంగా మార్చేశారని ఎద్దేవా చేశారు. లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ కుటుంబం దాచుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. మూసీ నదిని ప్రక్షాళన చేశామని టీఆర్‌ఎస్ సర్కార్ పదేపదే ప్రకటిస్తోందని, కొబ్బరి నీళ్లలాంటి మూసీ నీటిని సీఎం కేసీఆర్ తాగుతారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రెండున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తే.... కేసీఆర్ రెండు వందల ఇళ్లను కూడా నిర్మించలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను గాలికి వదిలిసి, సీఎం ఫాంహౌజ్‌లో పడుకున్నారని ఆయన విమర్శించారు. ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేసి ఉంటే పేదలకు కరోనా చికిత్స ఉచితంగా అందేదని, ఈ విషయంలో ఇక్కడి ప్రభుత్వం ఏం చేసిందో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణను సాధించడంలో బీజేపీ పాత్ర కీలకమని, సుష్మా స్వరాజ్ లేకపోయినా... ఆమె పోరాట స్ఫూర్తిని మాత్రం తెలంగాణ ప్రజానీకం మరిచిపోదని జవదేకర్ అన్నారు. 

Updated Date - 2020-11-22T18:48:47+05:30 IST