Abn logo
Sep 23 2021 @ 00:04AM

మాతాశిశు మరణలు లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం

పోషణఅభియాన్‌ మాసోత్సవంలో పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మాతా శిశు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్ధేందుకు కలసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం కేంద్ర సమాచార శాఖ, జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా పోషణ అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీస్‌ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ సూరినేని శ్రీధర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో మహిళ గర్భం దాల్చిన నాటి నుంచే డెలవరీ అయి శిశువుకు ఐదు సంవత్సరాలు నిండేంత వరకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. అంతేకాకుండ కేసీఆర్‌ కిట్‌తో పాటు మగ శిశువు జన్మిస్తే రూ.12, ఆడ శిశువు జన్మిస్తే తల్లి అకౌంట్‌లో రూ. 13వేలు జమ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో సర్కారు ఆస్పత్రుల్లో డెలవరీల శాతం 24 శాతం ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పించడంతో ప్రస్తుతం 55 నుంచి 65 శాతానికి పెరిగాయని చెప్పారు.  

గ్రోత్‌ మానిటరింగ్‌లో ఆదర్శం...

చిన్నారుల గ్రోత్‌ మానిటరింగ్‌లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఈ విషయాన్ని స్వయంగా కేంద్రం ప్రశంసించిందని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు.  రాష్ట్రంలో కొత్తగా 12 మెడికల్‌ కళాశాలలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌ ప్రస్తుతం ఉన్న ఏరియాసుపత్రులను మాతాశిశు ప్రభుత్వ దవాఖానాలుగా మార్చి మరింత సేవలను అందించనున్నారని చెప్పారు. పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో కమిటీ వేసి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అధ్యయనం చేయించారని అన్నారు. రాష్ట్రంలో 16 వేల మంది అనాథలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని, వారి సంరక్షణ కోసం విధివిధానాలను రూపొందించేందుకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీని కూడా వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, శిశువులు, అనాథల సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. 

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం.. : కలెక్టర్‌ శశాంక

పోషకాహారంతోనే భావితరాలకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ శశాంక అన్నారు. పోషక లోపాలను అధిగమించేందుకు పోషణ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్‌ను పోషణ మాసంగా నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ... పేదవాళ్లకు పౌష్టిహాకారం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పథకాలను తీసుకువస్తున్నారని చెప్పారు. అనంతరం ఉత్తమ సేవలందించిన అంగన్‌వాడీ టీచర్లు భారతి, శ్రీలత, వాణి, ఉమలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ అభిలాషఅభినవ్‌, ట్రైనీ కలెక్టర్‌ అభిషేక్‌అగస్త్య, రాష్ట్ర బాల హక్కుల కమిషన్‌ సభ్యులు బృందాదర్‌రావు, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలతలెనినా, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నాగవాణి, సభ్యులు డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ పాల్గొన్నారు.