ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలి

ABN , First Publish Date - 2020-08-04T10:18:48+05:30 IST

కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ముందుకు రావాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు.

ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలి

కరోనా బాధితులకు సేవలందిస్తే ఉత్తమ ప్యాకేజీ

మంత్రి సీదిరి అప్పలరాజు 


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, ఆగస్టు 3): కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు ముందుకు రావాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖల మంత్రి సీదిరి అప్పలరాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(జీజీహెచ్‌)లో సోమవారం కలెక్టర్‌ నివాస్‌తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ముందుగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ‘కరోనా బాధితులకు సేవలందించేందుకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ముందుకు వస్తే ప్రభుత్వం ఉత్తమ ప్యాకేజీ ఇస్తుంది. సిబ్బందిని   కేటాయించేందుకు సిద్ధంగా ఉంది. తద్వారా వైద్యసేవలపై భారం తగ్గుతుంది’ అని తెలిపారు. అలాగే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ చికిత్స సకాలంలో జరగాలని ఆదేశించారు. ‘ఇక్కడ చికిత్స ప్రతిష్టాత్మకంగా భావించాలి. నాకు ఒకవేళ కరోనా సోకితే.. జీజీహెచ్‌లోనే చికిత్స కోసం చేరుతాను. జీజీహెచ్‌ అనేది సాధారణ వైద్య చికిత్సలకు పరిమితం చేయకూడదు.


వీలైనంత సూపర్‌ స్పెషాల్టీ సేవలు ప్రతిష్టాత్మకంగా అందించాలి. సీటీడీ విధానం వినియోగించాలి. ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్‌ సరఫరా ఉండాలి. కరోనా బాధితులను చూడాలనుకునేవారు.. సొంతంగా పీపీఈ కిట్‌ ధరించి వస్తేనే అనుమతించాలి. బాధితులకు ప్లాస్మాథెరపీని పరిశీలించాలి.  రికవరీ అయిన పేషెంట్లు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. తక్కువ ఖరీదుతో ప్లాస్మాథెరపీతో వైద్యం అందించేందుకు అవసరమైన పరికరాల పంపిణీకి సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారు. వైద్యసేవలపై బాధితుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించాలి’ అని మంత్రి తెలిపారు. ‘కరోనా నేపథ్యంలో ప్రభుత్వ వైద్యసేవలపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో సేవలు విస్తృతం చేయాల్సి ఉంది. ప్రతివార్డుకూ ఒక వీఆర్వోను నియమించి బాధితులకు అవగాహన కల్పిస్తా’మని మంత్రి వివరించారు.  కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ.. ‘కరోనా కట్టడి చర్యల్లో భాగంగా 108 అంబులెన్స్‌లు 18 ప్రత్యేకంగా వినియోగిస్తున్నాం.


ప్రతి మండలంలో ప్రత్యేకంగా అంబులెన్స్‌ కేటాయించాం. తహశీల్దార్‌ వద్ద రెండు టాటా ఏస్‌ వాహనాలను సమకూర్చాం. ఇక్కడి నుంచే విశాఖ విమ్స్‌కు ప్రభుత్వ పరంగా పంపిస్తున్నా’మని తెలిపారు.  జీజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌  కృష్ణవేణి మాట్లాడుతూ.. ‘రెండు వీఆర్డీఎల్‌ ల్యాబ్‌ల్లో రోజుకు నాలుగువేల పరీక్షలు చేస్తున్నాం.కొవిడ్‌ ఫ్లోర్‌లలో డ్యూటీ వైద్యులు, నర్సులు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓల నియామకం చేపట్టాం. ఆసుపత్రిలో బాధితులకు టూత్‌పేస్ట్‌ నుంచి అన్నిరకాల సామగ్రిని అందించాం. వైద్యసిబ్బందికి  డెప్యుటేషన్లను రద్దు చేశాం. కొత్తగా 38 వెంటిలేటర్లు తెప్పిస్తున్నా’మని తెలిపారు. కార్యక్రమంలో జేసీ సుమిత్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ చెంచయ్య, జీజీహెచ్‌ ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T10:18:48+05:30 IST