Abn logo
Oct 20 2021 @ 02:22AM

ఇదేనా క్రీడాభివృద్ధి?

పట్టించుకోని క్రీడా మంత్రి, శాట్స్‌ చైర్మన్‌

పూర్తిస్థాయి వీసీ-ఎండీ లేక ఇక్కట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి): పంజాబ్‌, హరియాణా, ఒడిశా వంటి రాష్ట్రాల్లో స్టేడియాలు వెలిగి పోతుంటే స్వరాష్ట్రంలోని ప్రధాన మైదానాలు ఉసూరుమనేలా తయారయ్యాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడంలో, హైదరాబాద్‌లోని ప్రధాన స్టేడి యాలను ఆధునికీకరించడంపై పాలకులు చూపిస్తున్న అలసత్వం క్రీడారంగం అభివృద్ధిపై వారికున్న వివక్షకు అద్దం పడుతోంది. ఏడాదిన్నరగా రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ (శాట్స్‌)కు పూర్తిస్థాయి వీసీ-ఎండీ లేకపోవడంతో పాలనా వ్యవహారాలన్నీ గాడి తప్పాయి. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆర్నెల్లకోసారి తూతూమంత్రంగా సమీక్ష నిర్వహించి చెయ్యి దులుపుకుంటుంటే, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి వ్యవహారం మాటలు ఘనం.. చేతలు శూన్యంలా ఉంది. శాట్స్‌ చైర్మన్‌గా రెండో పర్యాయం పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగుస్తున్నా.. సమస్యల పరిష్కారంలో ఆయన ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌కు హరియాణా నుంచి 40, పంజాబ్‌ నుంచి 19 మంది అథ్లెట్లు వెళ్లగా, తెలంగాణ నుంచి కేవలం ఇద్దరేవెళ్లారు. దీనిని సవాలుగా తీసుకొని వచ్చే ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఏ విధంగా తయారు చేయాలనే దానిపై శాట్స్‌ వద్ద ఇప్పటికీ ఒక్క ప్రణాళిక లేకపోవడం గమనార్హం.


గోప్యంగా కన్సల్టెన్సీ..

క్రీడారంగ అభివృద్ధిపై రూట్‌ మ్యాప్‌ తయారీకి ఒక కన్సల్టెన్సీతో ఈ మధ్య శాట్స్‌ గోప్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది పాటు సదరు కన్సల్టెన్సీ శాట్స్‌తో కలిసి పనిచేయనున్నందుకు గాను ఆ కంపెనీకి సుమారు రూ.1.30 కోట్లు చెల్లించేందుకు మంత్రి కనుసన్నల్లో ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. టెండర్లలో కేవలం రెండే సంస్థలు పాల్గొన డంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్‌ పాలసీ రూపకల్పన, కేంద్ర క్రీడాశాఖ నుంచి వివిధ స్కీముల ద్వారా రాష్ట్రానికి నిధులు తీసుకురావడం వంటివి ఈ కన్సల్టెన్సీ చేయాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా శాట్స్‌ సిబ్బందిపైనే పెత్తనం చేస్తూ వారితోనే పని చేయిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేదని.. శాట్స్‌ అధికారులు రూపొందించిన స్పోర్ట్స్‌ పాలసీకే గ్రాఫిక్స్‌ జతచేసి చేతులు దులుపుకుంటున్నారని, క్రీడా సంఘాలతో కనీసం ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని తెలుస్తోంది. సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు తడుముకుంటున్న శాట్స్‌... కన్సల్టెన్సీ పేరుతో ఇంత మొత్తం దుబారా చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.


అప్పులు చేయాల్సి వస్తోంది..

ఇదిలావుండగా, ప్రతినెలా 20వ తేదీ తర్వాతే జీతాలు వస్తున్నాయని.. ఈలోపు కుటుంబ అవసరాలు తీర్చడానికి అప్పులు చేయాల్సి వస్తోందని శాట్స్‌ ఉద్యోగులు వాపోతు న్నారు. ఇక, దీర్ఘకాలికంగా నడుస్తున్న కోచ్‌ల సర్వీస్‌ క్రమబద్ధీకరణ, పీఆర్సీ సవరణ, క్రీడా సంఘాలకు గ్రాంట్లు ఇవ్వడం వంటి ఫైళ్లన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కేవలం ఏడుగురు రెగ్యులర్‌ కోచ్‌లతోనే నెట్టుకొస్తున్న శాట్స్‌.. కనీసం ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోతోంది. శాట్స్‌ అనేది కార్పొరేషన్‌ తరహా సంస్థ కాబట్టి కోచ్‌ల రెగ్యులరైజేషన్‌కు యాక్ట్‌-2 అడ్డు కాదని 2016లో అప్పటి వైఏటీ సెక్రటరీ బి.వెంకటేశం అధికారికంగా పేర్కొన్నారు. అయినా, ఇప్పటివరకు కోచ్‌ల రెగ్యులరైజేషన్‌ ఫైల్‌ ముందుకు కదల్లేదు. వీసీ-ఎండీగా పూర్తిస్థాయిలో ఒక ప్రత్యేక అధికారి వస్తే తప్ప ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభించదని క్రీడాకారులు వాపోతున్నారు.