గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్‌దే గెలుపు : తలసాని

ABN , First Publish Date - 2020-09-30T00:47:09+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే రానున్న ఎన్నికల్లో తమపార్టీని గెలిపిస్తాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్‌దే గెలుపు : తలసాని

హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలే రానున్న ఎన్నికల్లో తమపార్టీని గెలిపిస్తాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని తలసాని ధీమా వ్యక్తం చేశారు.


మంగళవారం రాత్రి ఈ మేరకు ఓ ప్రకటనను మంత్రి విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు దేశంలో ఎక్కడా లేని విధంగా నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ గోశామహల్ నియోజకవర్గం పరిధిలో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిన 10 మంది బాధితులకు శ్రీ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 25 వేల చెక్కును మంత్రి అందజేశారు.


ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్, జీవో 58,59 ద్వారా ప్రజల ఆస్థులను క్రమబద్దీకరించి కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కొంత మంది మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదన్నారు. ఒకసారి ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగాలని, మరోసారి బ్యాలెట్ ద్వారా అంటూ ప్రజలకు అనవసర అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - 2020-09-30T00:47:09+05:30 IST