గొర్రెల పంపిణీ, సంపద పెంపులో తెలంగాణ నెంబర్ వన్: తలసాని

ABN , First Publish Date - 2021-07-31T23:17:34+05:30 IST

గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

గొర్రెల పంపిణీ, సంపద పెంపులో తెలంగాణ నెంబర్ వన్: తలసాని

హైదరాబాద్: గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల పశువైద్యాధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారుల తో  పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, 2 వ విడత గొర్రెల పంపిణీ అమలు పై  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారం, తోడ్పాటు, వివిధ కార్యక్రమాల అమలుతో పశుసంవర్ధక శాఖకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వివరించారు. కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ తో అద్బుతమైన ఫలితాలు లభించాయని అన్నారు. 


రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ఈ నెల 28 వ తేదీన హుజూరాబాద్ లో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. పెరిగిన అన్ని ధరలను దృష్టిలో ఉంచుకొని గొర్రెల యూనిట్ ధరను పెంచాలని ముఖ్యమంత్రి ని కోరిన మీదట 1.25 లక్షల రూపాయల నుండి 1.75 లక్షల రూపాయల కు ముఖ్యమంత్రి పెంచారని చెప్పారు. ధనవంతులైన గొల్ల, కురుమలకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ ఉండాలనే గట్టి సంకల్పంతో ముఖ్యమంత్రి ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. పంపిణీ చేసే గొర్రెలకు కొనుగోలు ప్రాంతంలోనే ఇన్సురెన్స్ చేసి పత్రాలను అందజేసేలా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. 


గొర్రెలు చనిపోతే సకాలంలో తగు చర్యలు తీసుకోకపోవడం వలన ఇన్సురెన్స్ క్లెయిమ్ కాక రైతులు నష్టపోతున్నారని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చనిపోయిన గొర్రెకు 10 రోజులలోగా క్లెయిమ్ చేసి బాధితుడికి గొర్రెను అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్ళాలి అనే లక్ష్యంతో ప్రారంభించిన సంచార పశువైద్య శాలల పనితీరు పట్ల నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గొర్రెల పెంపకందారులు గొర్రెలను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు, వసతులతో కూడిన మార్కెట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కాగా ఆగస్టు 6 నుండి 13 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని గజ్వేల్ లో లాంచనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

Updated Date - 2021-07-31T23:17:34+05:30 IST