మలేరియా వ్యాధి మూలాలను ప్రపంచానికి చాటిన రోనాల్డ్ రాస్

ABN , First Publish Date - 2021-08-20T20:50:46+05:30 IST

మలేరియా వ్యాధి కారక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్ రోనాల్డ్ రోస్ అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

మలేరియా వ్యాధి మూలాలను ప్రపంచానికి చాటిన రోనాల్డ్ రాస్

హైదరాబాద్: మలేరియా వ్యాధి కారక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి సర్ రోనాల్డ్ రోస్ అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం బేగంపేట లోని సర్ రోనాల్డ్ రోస్ ఇనిస్టిట్యూట్ లో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోనాల్డ్ రోస్ పోస్టల్ కవర్ ను మంత్రి శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే భవనం లో అనేక పరిశోధనలు చేసి 1897వ సంవత్సరం ఆగస్టు 20న మలేరియా మహమ్మారి మూలాలను రోనాల్డ్ రోస్ తెలిపారని అన్నారు.  సర్ రోనాల్డ్ రాస్ కృషికి ఫలితంగా  1902వ  సంవత్సరంలో నోబెల్ బహుమతి రావటం  వైద్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు. 


మలేరియా వ్యాధి భారిన పడి  చనిపోతున్న  వ్యాధిగ్రస్తులను చూసి చలించిపోయిన రోనాల్డ్ రోస్ వారిని కాపాడాలనే లక్ష్యంతోఅనేక పరిశోధనలు చేశారని అన్నారు. ఈ వ్యాధి వ్యాపించడానికి ఆడ ఎనాఫిలిస్ దోమ కారణమని తెలుసుకున్న రోనాల్డ్ రోస్ వాటి వృద్ధిని నివారించడానికి తగు సూచనలు చేసి  మలేరియా మహమ్మారి నుంచి ఈ ప్రపంచానికి విముక్తి కలిగించారని చెప్పారు.ఈ దోమలు నిల్వ ఉన్ననీటిలో అభివృద్ధి చెంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషి కి ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయని తెలిపారు.నీటిలో దోమలు లార్వా దశలో ఉండటంవల్ల వాటి పెరుగుదలను సులువుగా నివారించవచ్చు తద్వారా వ్యాధి బారిన పడకుండా  మనల్ని మనం కాపాడుకోవచ్చు.  


ఇంకా ప్రజలలో దానిపైన సరైన అవగాహన లేకపోవడం, కొంతమంది పారిశుధ్య నిర్వహణ ను పట్టించుకోకుండా ఉండటం వంటి కారణాలతో  ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు. నేటి విద్యార్థులకు, యువ శాస్త్రవేత్తలకు ఈ భవనం కు ఉన్న ప్రాధాన్యత, చరిత్రను తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ రవీందర్ , కార్పొరేటర్ మహేశ్వరి, ప్రొపెసర్లు లక్ష్మీనారాయణ, రెడ్యా నాయక్, బాల కిషన్, రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-20T20:50:46+05:30 IST