ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: తలసాని

ABN , First Publish Date - 2020-10-21T20:20:24+05:30 IST

గత 100 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలతో నగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురైనాయని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: తలసాని

హైదరాబాద్: గత 100 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కురిసిన భారీ వర్షాలతో నగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురైనాయని  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని నాలా బజార్, రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలోని నల్లగుట్ట, సి లైన్, ఎఫ్ లైన్, బేగంపేట డివిజన్  పరిధిలోని బ్రాహ్మణ వాడి తదితర ప్రాంతాలలో ముంపుకు గురైన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురై నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.


ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రతి బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో స్పందించి ముంపుకు గురైన వారికి 10 వేలు, ఇండ్లు కూలిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల కు 50 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేయాలని ఆదేశించారని వివరించారు. బాధిత కుటుంబాలు అన్నింటికీ ఆర్ధిక సహాయం అందించే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.


ప్రతిపక్షాల నాయకులు ప్రభుత్వం పై విమర్శలు మాని బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. ముంపు ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటిస్తూ ప్రజలకు అన్ని విధాలుగా చేయూతను అందిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల రూప, అత్ట్టిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి, డీసీ ముకుంద రెడ్డి, సికింద్రాబాద్ ఎంఆర్ఓ బాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T20:20:24+05:30 IST