దిశతో మహిళల రక్షణకు భరోసా

ABN , First Publish Date - 2021-07-30T06:09:08+05:30 IST

అత్యాచారాలు, వేధింపులు, మానసిక ఒత్తిళ్లు, గృహహింసలకు గురయ్యే మహిళలకు రక్షణగా దిశ వన్‌ స్టాప్‌సెంటర్‌ భరోసా ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితతెలిపారు.

దిశతో మహిళల రక్షణకు భరోసా
దిశ వన్‌ స్టాప్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు తానేటి వనిత, మేకతోటి సుచరిత తదితరులు

మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత

మహిళా ప్రాంగణంలో దిశ వన్‌ స్టాప్‌ సెంటర్‌ ప్రారంభం

గుంటూరు(విద్య), జూలై 29: అత్యాచారాలు, వేధింపులు, మానసిక ఒత్తిళ్లు, గృహహింసలకు గురయ్యే మహిళలకు రక్షణగా దిశ వన్‌ స్టాప్‌సెంటర్‌ భరోసా ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనితతెలిపారు. గుంటూరులోని    మహిళా ప్రాంగణంలో దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఆమె గురువారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ  ఈ సెంటర్‌ మహిళలకు రక్షణ కల్పించడంతోపాటు వారికి న్యాయపరమైన సేవల్ని అందిస్తుందన్నారు.   దిశ సెంటర్‌లో అన్ని వేళల్లో 19 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. సమాజంలో ఉద్యోగినులు, గృహిణులు, విద్యార్థినులు, చిన్నారులు అనేక చోట్ల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దిశ పోలీసు స్టేషన్లు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రసంగిస్తూ మహిళలకు మానసిక స్థైర్యం కల్పించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి అనుసంధానంగా దిశ వన్‌స్టాప్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శిశు మహిళా సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికాశుక్లా, సీనియర్‌ సిటిజన్స్‌ విభాగం ప్రిన్సిపల్‌ సెక్రటరి ఏఆర్‌ అనురాధ, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తాఫా, మద్ధాళి గిరిధర్‌, నగర మేయర్‌ కావటి మనోహరనాయుడు, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేసీ ప్రశాంతి, జిల్లా మహిళా శిశుసంక్షేమశాఖ పీడీ మనోరంజని, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి, కార్పొరేటర్‌ అడకా పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

 అత్యాచార బాధితులకు పరామర్శ

గుంటూరు(జీజీహెచ్‌): జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఆత్యాచారానికి గురై జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబసభ్యులను మంత్రులు తానేటి వనిత, సుచరిత గురువారం పరామర్శించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేశారు. పశువులను కాసేందుకు వెళ్లిన దివ్యాంగ యువతిపై కామాంధుడు ఆత్యాచారానికి పాల్పడటం అమానుషమన్నారు. దిశ చట్టం వల్ల 50 రోజుల్లోనే విచారణ పూర్తిచేసి నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా చూస్తామన్నారు.  

  

Updated Date - 2021-07-30T06:09:08+05:30 IST