కర్ణాటకీయం: సీఎం పదవికి తగిన వాడినేనన్న మరో మంత్రి

ABN , First Publish Date - 2021-07-13T02:10:44+05:30 IST

కర్ణాటకలో నాయకత్వ (సీఎం) మార్పు ఉండదని బీజేపీ అధిష్ఠానం నమ్మబలుకుతున్నప్పటికీ ముఖ్యమంత్రి..

కర్ణాటకీయం: సీఎం పదవికి తగిన వాడినేనన్న మరో మంత్రి

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ (సీఎం) మార్పు ఉండదని బీజేపీ అధిష్ఠానం నమ్మబలుకుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పదవికి తాము అర్హులమని పలువురు రాష్ట్ర మంత్రులు ప్రకటించుకుంటూనే ఉన్నారు. యడియూరప్ప పూర్తి కాలం సీఎంగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి అరుణ్ సింగ్ ఇటీవల నాయకత్వ మార్పు ఆలోచనపై వివరణ ఇచ్చారు. అయినప్పటికీ తాజాగా మరో మంత్రి ఉమేష్ కట్టి సీఎం పదవికి తాను అర్హుడనేనని ప్రకటించుకున్నారు. ఇప్పటికే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ తాను సీఎం పదవికి సరిగ్గా సరిపోతానని తన మనసులోని మాటను బయటపెట్టారు.


సదానంద గౌడ ఇటీవల కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం బెంగళూరు విమానాశ్రయం వద్ద ఆయన మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. కాబోయే సీఎం అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సదానంద గౌడ ఉన్న సమయంలో యడియూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా తొలిసారి పగ్గాలు చేపట్టారు. కాగా, తాజాగా నాయకత్వ మార్పు ఊహాగానాలపై యడియూరప్ప సైతం ఆచితూచి స్పందిస్తున్నారు. కేంద్ర నాయకత్వం తనను ఇష్టపడేంత వరకూ పదవిలో కొనసాగుతానని ఇటీవల పేర్కొన్నారు. దీంతో యడియూరప్ప పాలనపై తమను నమ్మకం ఉందని అరుణ్ సింగ్ ప్రకటించారు.

Updated Date - 2021-07-13T02:10:44+05:30 IST