Abn logo
Jun 23 2021 @ 11:29AM

మహబూబ్‌నగర్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేముల వివరణ

హైదరాబాద్: మహబూబ్‌న‌గర్‌లో తాను చేసిన వ్యాఖ్యలు రాయల సీమ ప్రజలను ఉద్దేశించి కాదని...మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం రైతుల పొట్టకొట్టేలా అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఆంధ్ర పాలకులను ఉద్దేశించి చేసినవి మాత్రమే అని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా, బీజేపీ అధ్యక్షులు సోమ వీర్రాజు గుర్తించాలన్నారు.  కృష్ణాపై ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్ర రైతులు నష్టపోతారన్నదే తమ బాధ అని చెప్పుకొచ్చారు. కృష్ణా జలాల్లో నీటివాట తేల్చకుండా తాత్సారం చేస్తున్న బీజేపీ మీద పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నిన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని..వైఎస్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు అడ్డుపడి అనేక మంది తెలంగాణ బిడ్డల మరణాలకు కారణం వైఎస్ కాదా? అని నిలదీశారు. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికీ తెలంగాణ పాలిట రాక్షసుడే అని వ్యాఖ్యానించారు. అక్రమ ప్రాజెక్టులు కడుతున్న ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపడతామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.