బుజ్జగింపుల పర్వం

ABN , First Publish Date - 2021-01-12T13:08:48+05:30 IST

వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ను బుజ్జగించే దిశగా రాష్ట్రమంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి సోమవారం ఆయనతో ...

బుజ్జగింపుల పర్వం

రాందాస్‌తో మంత్రుల భేటీ

పొత్తు, సీట్ల కేటాయింపులపై చర్చలు

రిజర్వేషన్లపై పట్టుసడలించని పీఎంకే


చెన్నై: వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ అన్నాడీఎంకే ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ను బుజ్జగించే దిశగా రాష్ట్రమంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి  సోమవారం ఆయనతో చర్చలు జరిపారు. దిండివనం తైలాపురం గార్డెన్‌ ప్రాంతంలో ఉన్న రాందాస్‌ నివాసానికి మంత్రులిద్దరు స్వయంగా వెళ్లి అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే కొనసాగాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో పీఎంకే కీలకపాత్ర వహించింది. ఆ ఎన్నికల్లో తేని నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తనయుడు రవీంద్రనాథ్‌ మాత్రమే గెలిచారు. మిగిలిన 38 లోక్‌సభ నియోజకవర్గాలలో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులంతా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు ఇక మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో అన్నాడీఎంకే మిత్రపక్షమైన పీఎంకే నాలుగు దశాబ్దాలకు ముందటి డిమాండ్‌ను తెరపైకి తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. వన్నియార్లకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ పీఎంకే నెల రోజులుగా దశలవారీగా రాష్ట్రమంతటా ఆందోళనలు నిర్వహించింది. ఆ నేపథ్యంలో గత డిసెంబర్‌ 22న మంత్రులు తంగమణి, కేపీ అన్బళగన్‌ దిండివనంలో రాందాస్‌ను కలుసుకుని తొలివిడత చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల లోగా వన్నియార్లకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ రాందాస్‌ పట్టుబట్టడంతో ఆ చర్చలు ఫలించలేదు. మంత్రులిరువురూ నిరాశతో తిరుగుముఖం పట్టారు. 


పీఎంకే తీర్మానం

ఈ నేపథ్యంలో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన పీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లకు బదులుగా అమలులో ఉన్న 20 ఎంబీసీ రిజర్వేషన్లలో అత్యధిక వాటా కల్పించాలని  తీర్మానిస్తే కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. వన్నియార్లకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ పట్టుబడుతూ వచ్చిన పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ ఉన్నట్టుండి ఎంబీసీ విభాగం కింద అంతర్గత రిజర్వేషన్లు కల్పించాలని కోరడం అన్నాడీఎంకే నేతలకు ఆశ్చర్యాన్ని గురి చేసింది. వన్నియార్లకు ఈ అంతర్గత రిజర్వేషన్లను అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ను అన్నాడీఎంకే ప్రభుత్వం ఆమోదించకుంటే  పీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం మళ్లీ ఏర్పాటు చేసి భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని రాందాస్‌ హెచ్చరించారు.   సంక్రాంతి తర్వాత జరుగనున్న వార్షిక తొలి అసెంబ్లీ సమావేశంలో వన్నియార్లకు రిజర్వేషన్లు ప్రకటిస్తూ తీర్మానం చేసి ఆమోదించాలని రాందాస్‌ కోరుతున్నారు. అసెంబ్లీలో వన్నియార్లకు రిజర్వేషన్లు ప్రకటించకపోతే రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో రాందాస్‌ను బుజ్జగించేందుకుగాను రాష్ట్రమంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి సోమవారం ఉదయం దిండివనం వెళ్ళి తైలాపురం గార్డెన్‌లోని  గృహంలో చర్చలు ప్రారంభించారు. ఈ సమావేశంలో రాందాస్‌ తనయుడు, పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌, పార్టీ అధ్యక్షుడు జీకే మణి, ఇతర నేతలు పాల్గొన్నారు.  వన్నియార్లకు రిజర్వేషన్లు కల్పించడం, అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు కేటాయించాల్సిన సీట్లపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా రాష్ట్రంలో పీఎంకే గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలను గురించి మంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణికి వివరించారు. అన్నాడీఎంకే కూటమిలో అత్యధిక సీట్లు పొందాలని  బీజేపీ తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. అదే సమయంలో బీజేపీ కంటే తమకే అత్యధిక సీట్లు కేటాయించాలని పీఎంకే కూడా పట్టుబడుతోంది. బీజేపీ కన్నా తమ పార్టీకే రాష్ట్రంలో ఓటు బ్యాంకు అధికంగా ఉందని, కనుక కూటమిలో సీట్ల కేటాయింపులలో అగ్రతాంబూలం తమ పార్టీకే ఇవ్వాలని రాందాస్‌ మంత్రులిద్దరికి తెగేసి చెప్పారు. 

Updated Date - 2021-01-12T13:08:48+05:30 IST