హైదరాబాద్‌ సిటీలో మైనర్‌ పోకిరీలు!

ABN , First Publish Date - 2021-04-27T17:47:16+05:30 IST

రోజురోజుకు మహిళలపై అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి.

హైదరాబాద్‌ సిటీలో మైనర్‌ పోకిరీలు!

  • మహిళలను వేధిస్తున్న ఆకతాయిలు
  • తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్న షీటీమ్స్‌  
  • ఈవ్‌టీజింగ్‌ కేసుల్లో 40 శాతం వారే

హైదరాబాద్‌ సిటీ : రోజురోజుకు మహిళలపై అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లు, కళాశాలలు, బస్టాపులు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్‌,  పనిప్రదేశాలతో పాటు.. మహిళల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోకిరీలు, ఆకతాయిల వికృత చేష్టలకు, లైంగిక వేధింపులకు బాధిత మహిళలు నరకం అనుభవిస్తున్నారు. ఓ వైపు షీటీమ్స్‌ పోలీసులు మఫ్టీలో ఉంటూ మహిళలను వేధిస్తున్న పోకిరీలను, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న ఆకతాయిల ఆటకట్టిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడంలేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల షీటీమ్స్‌ అరెస్టు చేస్తున్న పోకిరీలు, ఆకతాయిల్లో ఎక్కువగా మైనర్‌లే పట్టుపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.


చిన్న వయసులోనే మహిళలను, వేధిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు వారి తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ గత నెలలో 22మంది మైనర్‌ పోకిరీలను షీటీమ్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారి తల్లిందండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో గత రెండేళ్లలో షీటీమ్స్‌ పోలీసులు 281 మంది మైనర్‌ పోకిరీల భరతం పట్టారు.


40 శాతం మైనర్లే...

ట్రై కమిషనరేట్‌ పరిధిలో బస్టాపులలో, కాలేజీల వద్ద రద్దీగా ఉండే ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌, సోషల్‌మీడియాలో వేధింపులకు పాల్పడుతున్న సుమారు 1500ల మందిని విచారించగా.. వారిలో 40శాతం మైనర్‌ పోకిరీలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోజు రోజుకు ఆ సంఖ్య పెరుగుతోంది. గత మార్చిలో ఒక్క సైబరాబాద్‌లోనే 22 మంది మైనర్‌ పోకిరీలు షీటీమ్స్‌కు పట్టుబడటం గమనార్హం.


వేర్వేరు ఫోన్లతో వేధింపులు..

ఆరు నెలలుగా 32 ఏళ్ల మహిళకు ఓ వ్యక్తి వివిధ నంబర్‌ల నుంచి ఫోన్‌ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తూ వచ్చాడు. అతని గొంతు, మాటతీరు బాలుడిలా ఉండటంతో ఆమె షీటీమ్స్‌ను ఆశ్రయించింది. షీటీమ్‌ పోలీసులు ఫోన్‌ చేయగా వారితో కూడా అతను అసభ్యకరంగా మాట్లాడాడు. అతని వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌లో ఉన్న బైక్‌ నంబర్‌ ఆధారంగా పోలీసులు విచారించారు. అతను వ్యక్తి కాదని, సిద్దిపేట జిల్లా సీతారామ్‌పల్లి గ్రామానికి చెందిన బాలుడిగా గుర్తించారు. అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 14 ఏళ్ల వయసున్న అతను 8వ తరగతి చదువుతున్నాడని, అతని ఫోన్‌తోపాటు స్నేహితుల ఫోన్‌లు తీసుకొని ఆ మహిళను వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులతో పాటు గ్రామ సర్పంచ్‌ ఆధ్వర్యంలో ఆ బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మరోసారి ఇలాంటిది జరగకుండా చూస్తామని సర్పంచ్‌ హామీ ఇచ్చారు.


తల్లిదండ్రులు సన్మార్గంలో పెట్టాలి..

చిన్నవయసులోనే పోకిరీలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు చెడు సహవాసాలు పట్టి వక్రమార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులు చూడాలి. వాళ్ల ప్రవర్తనలో ఏ మాత్రం భిన్నమైన మార్పు కనిపించినా వారిని వెంటనే సన్మార్గంలో పెట్టాలి. లేదంటే వారి భవిష్యత్తు అంధకారంగా తయారయ్యే ప్రమాదముంది. - అనసూయ, డీసీపీ, షీటీమ్స్‌ ఇన్‌చార్జి, సైబరాబాద్‌.

Updated Date - 2021-04-27T17:47:16+05:30 IST