మైనస్‌ 7.7 శాతం

ABN , First Publish Date - 2021-01-08T06:45:00+05:30 IST

కరోనా దెబ్బకు తయారీ, సేవా రంగాలు భారీగా కుదేలైన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.7 శాతానికి క్షీణించవచ్చని భారత ప్రభుత్వం అంచనా వేసింది.

మైనస్‌ 7.7 శాతం

2020-21 జీడీపీ వృద్ధి క్షీణతపై ప్రభుత్వ అంచనా 


న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు తయారీ, సేవా రంగాలు భారీగా కుదేలైన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ 7.7 శాతానికి క్షీణించవచ్చని భారత ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తంగా చూస్తే, ఆర్థిక కార్యకలాపాలు భారీగా తగ్గినప్పటికీ.. వ్యవసాయంతో పాటు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా వంటి యుటిలిటీ రంగాల ఆశాజనక పనితీరు కాస్త ఊరటనిచ్చే అంశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగాలు మాత్రం సానుకూల వృద్ధిని కనబర్చవచ్చని అంటోంది. జాతీయ గణాంకాల కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) గురువారం విడుదల చేసిన  మొదటి ముందస్తు జీడీపీ అంచనాలకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు.. 



2020-21కి ఆయా సంస్థల వృద్ధి అంచనాలు 

ఆర్‌బీఐ - 7.5%

ప్రపంచ బ్యాంక్‌ -9.6%

ఐఎంఎఫ్‌ -10.3

మూడీస్‌ - 10.6


 ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరానికి (2019-20) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.145.66 లక్షల కోట్లుగా నమోదైంది. 2020-21లో మాత్రం జీడీపీ రూ.134.40 లక్షల కోట్లకు పరిమితం కావచ్చు. 


 2019-20లో జీడీపీ వార్షిక ప్రాతిపదికన 4.2 శాతం వృద్ధి చెందగా.. 2020-21లో -7.7 శాతానికి క్షీణించవచ్చు.


 కనీస ధరల ఆధారంగా 2019-20లో స్థూల విలువ జోడింపు (జీవీఏ) రూ.133.01 లక్షల కోట్లుగా నమోదు కాగా.. 2020-21లో రూ.123.39 లక్షల కోట్లకు తగ్గవచ్చు. ఈ లెక్కన వృద్ధి రేటు వార్షిక ప్రాతిపదికన -7.2 శాతం క్షీణతను నమోదు చేసుకునే అవకాశం ఉంది. 


 ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.4 శాతం క్షీణించి రూ.1,26,968కి తగ్గవచ్చు. 2019-20లో తలసరి ఆదాయం రూ.1,34,226గా నమోదైంది. 


 ప్రస్తుత ధరల ఆధారిత గ్రాస్‌ ఫిక్స్‌డ్‌ క్యాపిటల్‌ ఫార్మేషన్‌ (జీఎ్‌ఫసీఎఫ్‌) 2020-21లో రూ.47.23 లక్షల కోట్లకు తగ్గనుంది. 2019-20లో ఇది రూ.54.72 లక్షల కోట్లుగా నమోదైంది. స్థిర ధరల ఆధారిత జీఎ్‌ఫసీఎఫ్‌ 2020-21లో రూ.37.07 లక్షల కోట్లకు పరిమితం కావచ్చు. 2019-20లో రూ.43.34 లక్షల కోట్లుగా ఉంది. 


 పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) వంటి కీలక ఆర్థిక సూచీల గణాంకాల సేకరణలో ఎదురవుతున్న సవాళ్లు జీడీపీ అంచనాలపై ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో విడుదల చేసే అంచనాలకు, ప్రస్తుత అంచనాలకు గణనీయ వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. 

 

 ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ, కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టే చర్యలపై ఇది ఆధారపడింది. 




ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు విడుదలైన జీడీపీ వృద్ధి గణాంకాలు 

మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌): -23.9% 

రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు): -7.5%



Updated Date - 2021-01-08T06:45:00+05:30 IST