మిరెపరెప

ABN , First Publish Date - 2021-10-20T06:17:51+05:30 IST

ఖరీఫ్‌లో సాగు చిత్రం మారింది. జిల్లాలో రైతులు మిరప సాగు వైపు మొగ్గు చూపారు. రికార్డు స్థాయిలో 31 శాతం మిరప సాగు విస్తీర్ణం పెరిగింది.

మిరెపరెప

మిర్చి సాగుకు మొగ్గు

31 శాతం పెరిగిన విస్తీర్ణం

ఖరీఫ్‌లో పడిపోయిన పత్తి సాగు


నరసరావుపేట, అక్టోబరు 19: ఖరీఫ్‌లో సాగు చిత్రం మారింది. జిల్లాలో రైతులు మిరప  సాగు వైపు మొగ్గు చూపారు. రికార్డు స్థాయిలో 31 శాతం మిరప సాగు విస్తీర్ణం పెరిగింది. 2.41 లక్షల ఎకరాలలో సాగైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. పత్తి సాగు చేసే రైతులు మిరప సాగుపై ఆసక్తి చూపారు. దీంతో ఈ సాగు విస్తీర్ణం పెరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వరి సాగు కూడా కొంత మేర పెరిగ్గా పత్తి సాగు తగ్గింది. గత ఏడాది మిరపకు మంచి ధర లభించడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటం వంటి కారణాలతో రైతులు మిరప సాగుకు ఆసక్తి చూపారు. ఈ కారణంగానే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. గత ఐదేళ్లలో సాగును పరిశీలిస్తే రికార్డు స్థాయిలో మిరప సాగు పెరిగినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. జిల్లాలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం 1,84,442 ఎకరాలు. దీని కన్నా అదనంగా 31 శాతం మిరప సాగు పెరిగింది. ఖరీఫ్‌లో మిరప 2,41,437 ఎకరాలలో సాగు చేశారు. గత ఏడాది కంటే 61,892 ఎకరాలలో సాగు పెరిగింది. వరి సాగులో కూడా ఈ ఖరీఫ్‌లో స్వల్ప వృద్ధి కనిపించింది. వరి సాధారణ విస్తీర్ణం 4,98,952 ఎకరాలు. ఖరీఫ్‌లో వరి సాగు 5,19,065 ఎకరాలలో సాగు చేశారు. పత్తి రైతులు మిరప, అపరాల సాగు వైపు మళ్లడంతోనే తెల్లబంగారం సాగు గణనీయంగా తగ్గింది.   


తెల్లబంగారం వెలవెల

జిల్లా పత్తి సాగుకు ప్రసిద్ధి చెందింది. అయితే కాలక్రమేణా ధరలు, తెగుళ్లు తదితరాల కారణంగా తెల్లబంగారం సాగు వెలవెలబోతున్నది. సాఽధారణ విస్తీర్ణంలో 65 శాతం మాత్రమే సాగు చేసినట్టు వ్యవసాయశాఖ లెక్కలు తెలియజేస్తున్నాయి. పత్తి సాగు సాఽధారణ విస్తీర్ణం 4,23,750 ఎకరాలు కాగా ఈ ఖరీఫ్‌లో 2,75,312 ఎకరాల్లో మాత్రమే సాగైంది. గత ఏడాదితో పోల్చితే 1,31,660 ఎకరాల్లో పత్తి సాగు తగ్గింది. అధిక వర్షాలతో పత్తి ఉరకెత్తుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత మూడేళ్లుగా గులాబీ రంగు పురుగు ప్రభావంతో పత్తి దిగుబడులు పడిపోయాయి. అధిక వర్షాలు పత్తి రైతులను దెబ్బతీశాయి. దీంతో సదరు రైతులు మిరప సాగు వైపు మొగ్గు చూపారు. 

Updated Date - 2021-10-20T06:17:51+05:30 IST