మిర్చి.. కడగండ్లు మిగిల్చి

ABN , First Publish Date - 2022-01-22T06:02:31+05:30 IST

ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు కష్టాలే మిగిలాయి. వరుస తెగుళ్లతో పాటు దిగుబడి మిర్చి సాగు రైతులను నష్టాల్లో ముంచింది.

మిర్చి.. కడగండ్లు మిగిల్చి
జీవంలేని మిరపతోట

అధికవర్షాలు, తెగుళ్లతో దెబ్బతిన్న పంట

తగ్గిన దిగుబడులు

ముండ్లమూరు/పీసీ.పల్లి, జనవరి 21 : ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులకు కష్టాలే మిగిలాయి. వరుస తెగుళ్లతో పాటు దిగుబడి మిర్చి సాగు రైతులను నష్టాల్లో ముంచింది. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ఏర్పడింది. దీంతో మిర్చి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ ఏడాది మిర్చి సాగు రైతులు పైరు నాటడం దగ్గర నుంచి కోత కోసేంత వరకు వరుసగా తెగుళ్లు వెంటాడాయి. దీంతో పాటు అధిక వర్షాల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పది పదిహేను రోజుల నుంచి మిర్చి సాగుచేసిన రైతులు ముమ్మరంగా కోతలు కోసి కల్లాల్లో మిర్చిని ఆరబెట్టి గ్రేడింగ్‌ చేస్తున్నారు. ఐతే ఒకటికి మూడింతలు పూర్తిగా తాలుకాయలే వస్తున్నాయి. కనీసం ఒక్కొక్క రైతు ఎకరం పొలంలో మూడు నాలుగు క్వింటాళ్ల మిర్చి కోస్తే కేవలం క్వింటా కూడా ఎర్రకాయలు రావడం లేదు. 80 శాతానికి పైగానే తాలు కాయలు రావడంతో రైతుల ఆశలు ఆవిరి అయ్యాయి. క్వింటాకు 15 నుంచి 20 మంది వరకు కూలీలు పడుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.250 కూలీ, కూలీల ప్రయాణ ఖర్చులు రూ.50తో సరాసరి రూ.300 అవుతుంది. దీంతో తాలుకాయలు క్వింటా రూ.5వేలు నుంచి రూ.6వేలు వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు కష్టానికి పైసా కూడా మిగల లేదు. పెట్టుబడి ఎకరానికి లక్ష రూపాయల నుంచి రూ1.50 లక్షల వరకు అవుతోంది. దిగుబడి వచ్చే సరికి ఎకరానికి నాలుగు క్వింటాళ్ల లోపు మాత్రమే అవుతున్నాయి. పైపెచ్చు 80 శాతం తాలు ఈ ఏడాది మిర్చి సాగు రైతు నడ్డి విరించింది. పంట కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకున్నారు. ఒక్కొక్క రైతు ఎకరం నుంచి 20 ఎకరాల వరకు మిర్చి సాగు చేశారు. మండలంలో ఉమామహేశ్వర అగ్రహారం, పూరిమెట్ల, నాయుడుపాలెం, పసుపుగల్లు, ముండ్లమూరు, తమ్మలూరు, ఈదర, నూజెండ్లపల్లి, సుంకరవారిపాలెం, బట్లపల్లి గ్రామాల్లో మిర్చి సాగును అత్యధికంగా సాగు చేశారు. కౌలు రైతుల పరిస్థితి మరింత ఆగమ్యగోచరంగా తయారైంది. ఒక్కొక్క ఎకరానికి రూ 25వేలు నుంచి రూ 35వేలు వరకు కౌలు ముందే కట్టి భూములు తీసుకున్నారు. వారి పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక అల్లాడి పోతున్నారు. ఆశాజనకంగా మిర్చికి ధర ఉన్నా, తెగుళ్లు, దిగుబడి మిర్చి రైతును కుంగదీసింది. మండలంలో ఈ ఏడాది ఉద్యాన శాఖ, వ్యవసాయ అధికారులు లెక్కల ప్రకారం 3,460 ఎకరాల్లో మిర్చిసాగు చేసినట్టు చెపుతున్నారు. కాని వాస్తవాన్ని పరిశీలిస్తే మరో రెండు వేల ఎకరాలు అదనంగా ఉంటుంది. అనాదినం భూములు, డీకే భూములు పశువుల మేత భూముల్లో కూడా రైతులు మిర్చి సాగు చేశారు. అవి మాత్రం లెక్కల్లోకి రావని, ఆన్‌లైన్‌ ఆ మిర్చి సాగును పరిగణలోకి తీసుకోదని రైతులు చెబుతున్నారు. దీంతో మిగిలిన వారికి ఎలాంటి బెనిఫిట్స్‌ వచ్చే అవకాశం కూడా లేదు.

ధరలు ఆశాజనకమే కానీ..!

పీసీపల్లిలో : ఈ ఏడాది మార్కెట్లో మిర్చి ధరలు మంచి ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటా ఏసీ కాయలు రూ.17,000 నుండి రూ.19,000 ధర పలికింది. దీంతో ఒక ఎకరంలో మిరపను సాగుచేస్తే పెట్టుబడి పోను ఆశించిన మేర ఆదాయాన్ని పొందవచ్చని భావించిన రైతులు మిరపను అత్యధికంగా సాగు చేశారు. మండలంలో కమ్మవారిపల్లి, పీసీపల్లి, తలకొండపాడు, పెదఅలవలపాడు, లక్ష్మక్కపల్లి, చిరుకూరివారిపల్లి, వరిమడుగు,పెద్దన్నపల్లి, గుదేవారిపాలెం, వేపగుంపల్లి గ్రామాల్లో సుమారు 400 ఎకరాలకు పైగా రైతులు మిరపను నాటారు. ఈ ఏడాది మండలంలో అధిక వర్షపాతం నమోదైంది. అధిక వర్షాలకు కూడా మిరపను రైతులు బతికించుకున్నారు. పైరు పూతకు వస్తున్న  దశలో తామరనల్లి ఓవైపు కుచ్చుతెగులు(వైరస్‌) మరోవైపు మిరపచెట్లపై ముప్పేట దాడిచేశాయి. ఈ సమయంలో పంటరక్షణ కోసం రైతులు రసాయనిక మందులు పిచికారి చేశారు. అయినప్పటికీ తామరనల్లి, వైరస్‌ అదుపులోకి రాలేదు. ఆకుల వెనుక భాగాన తామరనల్లి(కీటకం) చేరి ఆకులోని రసాన్ని మొత్తం పీల్చడంతో ఆకులు రాలిపోయి చెట్లు కూడా ఎండిపోతున్నాయి. మరికొన్ని చెట్లకు వైరస్‌ సోకడం ద్వారా ఆకులన్నీ ముడుచుకుపోయి చెండుగా తయారవడంతో చెట్లు ఎదుగుదల ఆగిపోయి పూత, పిందె రావడంలేదు. ఈ పరిస్థితుల్లో  దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు. తెగుళ్లను అదుపు చేసేందుకు ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది సూచించిన రకరకాల రసాయనిక మందులు చెట్లపై పిచికారీ చేసినప్పటికీ రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగాయే కానీ తెగుళ్లు మాత్రం అదుపులోకి రాకపోగా కళ్లముందే మిరపచెట్లు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది రైతులు పూర్తిగా వదిలేశారు. ఇప్పటివరకు ఎకరా మిరపను సాగుచేసిన రైతులు కౌలు, దుక్కి, నారు, నాటుఖర్చులు, ఎరువులు, పురుగుమందులు, అరకలు, కలుపుకూలీలు కలుపుకుని సుమారుగా 1.10లక్షల నుండి 1.30 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. తెగుళ్ల దాడితో పంట దిగుబడి తగ్గడం, పెట్టుబడులు పెరగడంతో ఈ ఏడాది మిరప సాగు చేసిన రైతులు తీవ్రనష్టాలు ఎదుర్కోక తప్పదు. ప్రభుత్వం పంటల బీమా మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని మండలంలోని మిరప సాగు చేసిన రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-22T06:02:31+05:30 IST