మిర్చి కొనుగోళ్లలో ఈ‘నామం’

ABN , First Publish Date - 2020-06-05T10:07:48+05:30 IST

వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల మధ్య పోటీతత్వం తీసుకురావడం ద్వారా రైతులకు

మిర్చి కొనుగోళ్లలో ఈ‘నామం’

ఐదేళ్లుగా అమలుకు నోచుకోని విధానం

ఫలితంగా పెచ్చుమీరుతున్న జీరో దందా 

కేంద్ర తాజా నిర్ణయంతో పరిస్థితి మారేనా?

‘ఒకే దేశం.. ఒకే మార్కెట్‌’తో తొలగనున్న అడ్డంకులు


ఖమ్మం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : వ్యవసాయ మార్కెట్లలో వ్యాపారుల మధ్య పోటీతత్వం తీసుకురావడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ర్టానిక్‌ నేషనల్‌ అగ్రి మార్కెటింగ్‌ విధానం (ఈనామ్‌)ను అమల్లోకి తెచ్చింది. ఇది జరిగి ఐదేళ్లవుతున్నా జిల్లాలోని మిర్చి మార్కెట్‌లో ఈ విధానం అమలుకు నోచుకోలేదు. ఫలితంగా రైతుకు గిట్టుబాటు ధర అందని ద్రాక్షలా మారింది. ఇక మిర్చి వ్యాపారంతో మార్కెట్‌కు రావాల్సిన ఆదాయంతోపాటు ప్రభుత్వానికి చెందాల్సిన సేల్‌ట్యాక్స్‌కు కూడా గండిపడుతోంది. ఖమ్మంవ్యవసాయ మార్కెట్‌లో పత్తి, అపరాలకు ఈనామ్‌ అమలు చేయాల్సి ఉండగా అది కార్యరూపం దాల్చడం లేదు. ప్రముఖ వాణిజ్య పంటగా పేరున్న మిర్చి కొనుగోళ్ల విషయంలో ఎలక్ర్టానిక్‌ మార్కెటింగ్‌ బిడ్డింగ్‌ ఉంటే రైతుకు మరింత ధర దక్కే అవకాశం ఉంటుంది. ఈ నామ్‌ అమలుకు మార్కెటింగ్‌శాఖ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని పంటలకు మాత్రమే ఈ పద్ధతిలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు పలు విధానాలు అమల్లోకి తెస్తున్నా క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను మాత్రం పరిష్కారం చేయకపోవడం వల్ల అనుకున్న లక్ష్యం పక్కదారి పడుతోంది. 


ముందుకు రాని వ్యాపారులు..

అయితే ఇప్పటి వరకు మార్కెట్లలో పంట ఉత్పత్తుల విక్రయాల విషయంలో ఉన్న వ్యత్యాసాలను రూపుమాపేందుకు తెచ్చిన ఈ నామ్‌ విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం మరో కొత్త విధానానికి తెరలేపింది. ఒకే దేశం ఒకే మార్కెట్‌ విధానంలో పంటల అమ్మకాలకు పచ్చజెండా ఊపి.. ఏ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న అవకాశాన్ని కల్పించింది. కానీ ప్రస్తుతం కేంద్రం అమల్లోకి తెస్తున్న ఈ విధానం కూడా ఈనామ్‌ తరహాలోనే ఉంటుందేమోనన్న అనుమానాలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈనామ్‌ అమల్లోకి వచ్చిన మూడేళ్ల తర్వాత పత్తి, అపరాల కొనుగోలుకు మాత్రమే వ్యాపారులు అంగీకరించారు. మిర్చి లాంటి వాణిజ్య పంటలు కూడా ఈనామ్‌ పద్ధతిలోనే కొనుగోలు చేయాలని నిబంధనలున్నా వ్యాపారులు ముందుకు రావడంలేదు. దీంతో మిర్చి మార్కెట్‌లో ఈనామ్‌ అమలు చేయలేని పరిస్థితి. ఒక్క ఖమ్మంమిర్చి మార్కెట్‌లోనే ఏటా 30లక్షల క్వింటాళ్ల మిర్చి కొనుగోలు జరుగుతుంది. తద్వారా రూ.1500కోట్ల వరకు టర్నోవర్‌ నడుస్తుంది. మరో 15లక్షల క్వింటాళ్ల మిర్చి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు, రైతులనుంచే నేరుగా కొనుగోలు చేసుకుని తరలిస్తున్నారు. 


అధికారులు చర్చలు జరుపుతున్నా ఫలితం శూన్యం..

మిర్చిని ఈ నామ్‌ పద్ధతిలో కొనుగోలు చేయాలని ప్రతి ఏటా సీజన్‌ ముందు మార్కెటింగ్‌శాఖ అధికారులు వ్యాపారులతో కమీషన్‌ ఏజెంట్లతో, ఖరీదువ్యాపారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వ్యాపారులు ఈనామ్‌ పద్ధతిలో మిర్చి కొనుగోలు చేయమని, అవపసరమైతే మిర్చి కొనుగోళ్లు ఆపేస్తామని బెదిరిస్తుండడంతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈ వేలంలో ఒకే రేటు వస్తుందని ఆశించినా వ్యాపారులు అంగీకరించకపోవడం, నగదు గ్యారెంటీ విషయంలో సమస్యలు తలెత్తడంతో ఈ నామ్‌ను చివరకుపత్తి, అపరాలకు మాత్రమే పరిమితం చేసి.. స్థానిక వ్యాపారులతో మాత్రమే కొనుగోలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్‌ యార్డుల్లో జీరో దందా తారస్థాయికి చేరడం, పలు సందర్భాల్లో రైతులు అధికారులు, వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆందోళనలకు దిగడం లాంటివి జరిగాయి.


నీరుగారిన లక్ష్యం...

ఈ నామ్‌ పద్ధతిలో మిర్చి లాంటి పంటలు కొనుగోలు చేస్తే జీరో వ్యాపారం తగ్గడంతోపాటు మార్కెటింగ్‌ ద్వారా సేల్‌ట్యాక్స్‌ ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. ఈ బిడ్డింగ్‌లో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల వ్యాపారాలు కూడా పాల్గొనాలని భావించినా అసలు ఈ నామ్‌ అమలుకు నోచుకోకపోవడంతో ఆ అవకాశం కుదరలేదు. మిర్చి లాంటి పంటలకు స్థానిక వ్యాపారులు కూడా ఈనామ్‌కు ముందుకు రాకపోవడంతో లక్ష్యం నీరుగారింది. ప్రస్తుతం క్వింటా మిర్చి ధర రూ.15వేల వరకు పలుకుతోంది. సీజన్‌ ప్రారంభానికి ముందు వరకు రూ.20వేల ధరపలికింది. స్థానిక వ్యాపారులు అనుకున్న ధరకే మిర్చి కొనుగోలు చేస్తున్నారు.ఈనామ్‌ పద్ధతిలో దేశంలో ఉన్న మార్కెట్‌లను అనుసంధానం చేస్తే ఖమ్మం మిర్చి మార్కెట్‌నుంచి దేశంలోని పలు రాష్ట్రాల వ్యాపారులు కూడా నేరుగా మిర్చి కొనుగోలు చేసే సదుపాయం ఉండేది. కానీ ఈ పద్ధతి పక్కదారి పట్టడంతో స్థానికంగా కూడా ఖమ్మం మార్కెట్‌లో ఈనామ్‌ పద్ధతిలో మిర్చి కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇప్పటికూనా ఈనామ్‌ అమల్లోకి తేవాలని మిర్చి రైతులు సూచిస్తున్నారు. 


కొత్తవిధానంతో చిగురిస్తున్న ఆశలు 

ఈ నామ్‌ పరిస్థితి అమలు ఇలా ఉన్న నేపథ్యంలో కేంద్రం కొత్తగా అమల్లోకి తెస్తున్న ఒకే దేశం.. ఒకే మార్కెట్‌ విధానం ఏ మేరకు ఫలితాలనిస్తోందనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌ కమిటీల యార్డులకు, లైసెన్సీలకు  వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఇష్టం వచ్చిన వ్యాపారికి అమ్ముకోవచ్చంటూ తెచ్చిన ఆర్డినెన్స్‌తో వ్యవసాయోత్పత్తుల స్వేచ్ఛా రవాణాపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. ఫలితంగా రైతులకు మెరుగైన ధరలు దక్కడంతో పాటు మార్కెట్‌ ఖర్చులు తగ్గుతాయని తెలుస్తోంది. అలాగే ఉత్పత్తులను అమ్ముకునే రైతులపై కూడా ఎలాంటి సెస్‌ కానీ, లెవీ కానీ ఉండదని, వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం చెబుతుండటంతో.. పంటలకు గిట్టుబాటు ధరలు దక్కే రోజులు త్వరలోనే రానున్నాయన్న ఆశలు రైతుల్లో చిగురిస్తున్నాయి. 

Updated Date - 2020-06-05T10:07:48+05:30 IST