మిర్చి రైతులు విలవిల

ABN , First Publish Date - 2022-01-17T06:13:18+05:30 IST

మిర్చి రైతులు విలవిల

మిర్చి రైతులు విలవిల
నర్సంపేట మండలం కొండైలుపల్లిలో దెబ్బతిన్న మిర్చిపంట, నల్లబెల్లి మండలం కొండైలుపల్లిలో నేలవాలిన మొక్కజొన్న పంట, రుద్రగూడెంలో కల్లంలో తడిసిన మిర్చిని చూపిస్తున్న రైతు రాజమల్లు

నర్సంపేట డివిజన్‌లోనే 14,343 ఎకరాల్లో దెబ్బతిన్న పంట

ఇతర పంటలు కలిపి 24వేల ఎకరాలు.. 

రూ.6కోట్ల మేర పంట నష్టం 

జిల్లా వ్యాప్తంగా 25వేల ఎకరాల్లో నీటిపాలైన పంట 

కన్నీళ్లు మిగిల్చిన వడగండ్ల వాన

ఆదుకోవాలని రైతుల వేడుకోలు 


నర్సంపేట, జనవరి 16: ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులకు వడగళ్ల వర్షం కన్నీళ్లనే మిగిల్చింది. జిల్లాలోని అన్ని మండలాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు వడగళ్ల వానతో చేతికి వచ్చిన పంటలు నేలమట్టమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 25,157 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. మిర్చి మినహా 10,811 ఎకరాల్లో మొక్కజొన్న, వేరుశనగ, ఇతర  పంటలు దెబ్బతినగా  9,284 మంది రైతులు తమ పంటను కోల్పోయారు. ఇదిలా ఉంటే ఒక్క నర్సంపేట డివిన్‌లోనే అన్ని పంటలు కలిపి 24,005 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 18,946మంది రైతులు తమ పంటను నష్టపోయారు. నర్సంపేట ఇందులో మిర్చి 14,343 ఎకరాల్లో దెబ్బతినడంతో 10,720 మంది రైతులు పంటను కోల్పోయి విలవిల్లాడుతున్నారు. ఇతర పంటల నష్టం  9,662 ఎకరాలు ఉంది. వడగండ్ల వానకు  మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.11కోట్ల విలువైన పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఇందులో ఒక్క నర్సంపేటలోనే రూ.6కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అధికారులు ఓ అంచనాకు వచ్చారు.  నర్సంపేట, ఖానాపురం, దుగ్గొండి చెన్నారావుపేట, నెక్కొండ, నల్లబెల్లి, గీసుగొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో మిర్చి, మొక్కజొన్న, పెసర్లు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  


నర్సంపేట డివిజన్‌లో అపారనష్టం

వడగళ్ల వానతో  నర్సంపేట డివిజన్‌  రైతులే అత్యధికంగా నష్టపోయారు. మూడు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు వర్షానికి దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. మిర్చిపంట జాలువారి, నీటమునిగింది.  పంటల కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయోనని లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలతో డివిజన్‌లో 24వేల ఎకరాల్లో మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పెసర, మినుము, అరటి పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలోనే ఒక్క నర్సంపేటలోనే 14,343 ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిని రూ.6కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి తమకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు మద్దతుగా వామపక్షాలు, పలు పార్టీల నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. రైతులకు పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేస్తున్నారు.


నల్లబెల్లి మండలంలో..

నల్లబెల్లి : మండలంలోని 18 గ్రామాల్లో మిర్చి పంటలు, 12 గ్రామాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రకటించారు. మండలంలో 2900 ఎకరాల్లో మిర్చి,  రెండు 2400 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. అయితే అకాల వర్షాలతో రుద్రగూడెం, భజ్జుతండ్డా, నారక్కపేట, నాగరాజుపల్లి,  కొండాలైపల్లిలో పూర్తిస్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. 

Updated Date - 2022-01-17T06:13:18+05:30 IST