అధ్వాన్న పాలనకు దర్పణాలు

ABN , First Publish Date - 2021-08-04T05:55:50+05:30 IST

రహదారులే రాష్ట్ర ప్రగతికి ప్రతీకలు; జాతి వైభవానికి దాఖలాలు. మౌలిక సదుపాయాల్లో రోడ్లు కీలకమైనవి. మరింత స్పష్టంగా చెప్పాలంటే రోడ్ల పరిస్థితి ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతుంది...

అధ్వాన్న పాలనకు దర్పణాలు

రహదారులే రాష్ట్ర ప్రగతికి ప్రతీకలు; జాతి వైభవానికి దాఖలాలు. మౌలిక సదుపాయాల్లో రోడ్లు కీలకమైనవి. మరింత స్పష్టంగా చెప్పాలంటే రోడ్ల పరిస్థితి ప్రభుత్వ పాలన తీరుకు అద్దం పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూచినా రోడ్లు అధ్వాన్న స్థితిలో దర్శనమిస్తున్నాయి. సర్వత్రా అవి గుంతలమయమయ్యాయి. ఫలితంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఆఖరికి రోడ్డు మీద నడుస్తూ వెళ్లే వాళ్లకు సైతం ఒక కాలు రోడ్డు మీద ఉంటే రెండో కాలు గోతిలో దిగే పరిస్థితి! వాహనదారులు పడే అగచాట్లు అంతా ఇంతా కాదు. రోడ్డు మీదకు వస్తే వాహనాలు పాడవుతున్నాయి. రాష్ట్రంలో రెండేళ్లుగా కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు ఉన్న రోడ్లకు కనీసం మరమ్మత్తులు చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. సంక్షేమం పేరుతో రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. 


దశాబ్దాలుగా రహదారులకు నోచుకోని మారుమూల గిరిజన గూడేలకు జగన్ ప్రభుత్వం ఒక్క మీటర్ రోడ్ వేసిన పాపాన పోలేదు. కానీ లాటరైట్, బాక్సైట్ తవ్వకాల కోసం ఆగమేఘాల మీద గిరిజన ప్రాంతంలో 30 అడుగుల వెడల్పుతో కొద్ది రోజుల వ్యవధిలోనే 14 కి.మీ. రోడ్లు వేసుకున్నారు. రెండేళ్ల నుంచి సాధారణ గిరిజన ప్రాంతాల్లో 16 రోడ్ల పనులకు గాను కేవలం 5 మాత్రమే పూర్తి చేశారు. గిరిజనుల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. ఇప్పటికే రోడ్డు సదుపాయాలు సరిగా లేక ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా దళిత వాడల్లో ఉంటున్న ప్రజానీకం ఇబ్బందులకు గురి కాకూడదని ఎస్సీ కాలనీల బాగు కోసం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వెచ్చిస్తారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళిత వాడల్లో 5,384 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. దళితులకే వెచ్చించాల్సిన నిధులు నేడు పక్కదారి పడుతున్నాయి. 2020–21లో దళిత కాలనీల్లో 21 రహదారి పనులకు కేవలం 9 మాత్రమే పూర్తి చేశారు. దళిత వాడలు మురికి వాడల్లా మిగలాల్సిందేనా? దళితుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం అయింది. 


ప్రజల ప్రాణాలు పోతుంటే జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మత్తులకు దశాబ్దాలు కావాలా అని కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మీద హైకోర్టు మొట్టికాయలు వేస్తే గాని జగన్ ప్రభుత్వం స్పందించదేమో? రోడ్లు, భవనాల శాఖకు కేటాయించిన ఇరవై వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు గానీ ఒక్క రహదారి వేయడానికి మాత్రం చేతులు రావడం లేదు. గుంతల మయమయిన రోడ్లను బాగు చేయాలని ప్రజలు నిలదీస్తుంటే తప్పుడు లెక్కలతో వారిని మభ్యపెట్టేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. 


రోడ్ల నిర్వహణ కోసం రూ.2000 కోట్లు కేటాయించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. వాస్తవానికి రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఖర్చు పెట్టకపోగా, రోడ్ల మీద సెస్సు నిధులను దారి మళ్లిస్తోంది. వాహనాల పన్నుల ద్వారా 2019–20కి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,181 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అదే విధంగా రోడ్‌ సెస్‌ పేరిట ప్రతి లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూపాయి చొప్పున నెలకు రూ.50 కోట్లు, ఏటా రూ.600 కోట్లు ప్రజల నుంచి గుంజుకుంటుంది. గత రెండేళ్లలో రూ.1200 కోట్లు రోడ్‌ సెస్‌ రూపంలో జనం నుంచి వసూలు చేసింది. ఆ డబ్బులను రోడ్ల కోసం ఖర్చు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేదే కాదు. పైగా ఈ సెస్సు ద్వారా వచ్చే నిధుల ఆధారంగా రూ.2వేల కోట్ల ఋణం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు! ఉన్న నిధులను దారి మళ్లించి, లేని రాని నిధుల కోసం ఆరాటపడుతున్నారు. నిధులను దుబారా చేసి లేని నిధులను కేటాయింపు కింద చూపడం, ఒకేసారి రూ.2 వేల కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెప్పడం అసంబద్ధం. సెస్‌ అంటే నిర్దిష్టంగా ఏ ప్రయోజనాల కోసం విధిస్తున్నారో, వాటి కోసమే వాడాలి. అయితే ఆ ఖాతా నుంచే ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వానికి ప్రాధాన్యతలుంటాయని చేయబోయే, చేస్తున్న తప్పును రాష్ట్ర పాలకులు సమర్థించుకుంటున్నారు. సెస్‌ ద్వారా ఏటా వసూలు అవుతున్న రూ.600కోట్లు, బడ్జెట్‌లో కేటాయిస్తున్న రూ.350 కోట్లు... మొత్తం రూ.950 కోట్లు ఖర్చు పెడితే రహదారులను అద్భుతంగా నిర్వహించవచ్చు. అందుబాటులో ఉన్న నిధులను వాడుకోకుండా, వాటిని ఆధారంగా చూపి అప్పుకు వెళ్లడం ఎంత వరకు సమంజసం? ప్రభుత్వ రోడ్ల పనులకు టెండర్లు పిలిస్తే వాటిని దక్కించుకోవడానికి కాంట్రాక్టర్లు పోటీ పడతారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇంతవరకు 403 పనులకు గాను టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ఒక్కరూ రావడం లేదు. గత బిల్లులు చెల్లించడానికే దిక్కు లేదు గాని ప్రస్తుత పనులకు బిల్లులు చెల్లిస్తుందా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో 10,900 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు ఈ ఏడాది బడ్జెట్ లో కేటాయించింది కేవలం రూ.481కోట్లు. అందులో పాత బకాయిలకు రూ.388 కోట్లు పోను మిగిలినది రూ.92 కోట్లు మాత్రమే. ఒక కి.మీ. రోడ్డును రూ. 84వేలతో మరమ్మత్తు చేసేందుకు ఆస్కారం ఉందా? ఇప్పటికే ప్రభుత్వం వేస్తున్న రోడ్లకు నాణ్యత ఉండటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక నుంచి ప్రతినెలా బిల్లులు బ్యాంకు ద్వారా ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా కాంట్రాక్టర్లు పెడచెవిన పెట్టేస్తున్నారు.


ఏపీ రహదారి భద్రత పాలసీ కింద ప్రతి  ఏటా జరిగే రోడ్డు ప్రమాదాలను 15 శాతం వరకు తగ్గించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించి ఆ దిశగా అడుగులు వేసింది. కానీ నేడు రోడ్లు అధ్వాన్నమయిపోయాయి. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. తెలుగు దేశం ప్రభుత్వం రోడ్లకు పెద్ద పీట వేసిందనడానికి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రే సాక్ష్యం. నేడు ఉన్న స్థితిలో నాడు రోడ్లు ఉంటే ఆయన పాదయాత్ర అంత సుదీర్ఘంగా చేయగలిగేవారా? ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రోడ్ల పనులను దారిలో పెట్టి ప్రగతిని గాడిలో పెట్టాలి. 

ఆలపాటి రాజేంద్రప్రసాద్

మాజీ మంత్రి

Updated Date - 2021-08-04T05:55:50+05:30 IST