మిర్యాలగూడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

ABN , First Publish Date - 2022-01-18T06:19:24+05:30 IST

మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రె్‌సలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

మిర్యాలగూడ కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు
కార్యకర్తలను సముదాయిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి

ఉత్తమ్‌, జానా ముందే పరస్పర దూషణలు 

జానా జోక్యంతో సద్దుమణిగిన వివాదం


మిర్యాలగూడ, జనవరి 17:  మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రె్‌సలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి పార్టీ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీలో మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి ఫొటో ముద్రించకపోవడంతో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులను వేదికపైకి పిలవకపోవడంపై పొదిల శ్రీనివాస్‌ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగం పూర్తికాగానే జానారెడ్డి మాట్లాడారు. సభ్యత్వ నమోదుపై సీనియర్‌ నాయకులు ఎవరైనా సలహాలు ఇవ్వాలని జానా కోరడంతో టీపీసీసీ కార్యనిర్వాహక సభ్యుడిగా కొనసాగుతున్న తనకు వేదికపై చోటుదక్కలేదని చిరుమర్రి కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పొరపాటుకు తనదే బాధ్యతని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ క్షమాపణ చెప్పారు. అనంతరం జానా పట్టుపట్టడంతో మాట్లాడేందుకు బీఎల్‌ఆర్‌ నిలబడగా, కార్యకర్తలంతా జై బీఎల్‌ఆర్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో శంకర్‌నాయక్‌ జోక్యం చేసుకొని మేం పనికిరామా? అంటూ ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని పార్టీ ప్రధా న కార్యదర్శి చిలుకూరి బాలును ఉద్దేశించి అన్నారు. దీంతో సమావేశం నినాదాలు, అరుపులతో రసాభాసగా మారింది. డీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై పార్టీ పట్టణ అధ్యక్షు డు వేణుగోపాల్‌రెడ్డి ఆక్షేపణ తెలపగా, ఆయనకు మద్దతుగా కార్యకర్తలు వేదికపైకి తోసుకువచ్చారు. వెంటనే జానారెడ్డి జోక్యం చేసుకొని నినాదాలతో కొందరికి మనస్తా పం కలిగే అవకాశం ఉందనే విషయాన్ని కార్యకర్తలు గుర్తించాలన్నారు. అరుపులు, కేకలతో ఎమ్మెల్యే టికెట్లు రావని, సమన్వయంతో కలిసి పనిచేసి ఏకాభిప్రాయానికి వచ్చినప్పడే సాధ్యపడుతుందని కార్యకర్తలను శాంతపరచడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - 2022-01-18T06:19:24+05:30 IST