వృద్ధాప్యంలోనూ తప్పని కాయకష్టం

ABN , First Publish Date - 2021-05-06T05:59:28+05:30 IST

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పేదరికం, అవగాహన లేమి, బతుకు దెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినవారి తల్లిదండ్రులైన వృద్ధులు...

వృద్ధాప్యంలోనూ తప్పని కాయకష్టం

పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పేదరికం, అవగాహన లేమి, బతుకు దెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినవారి తల్లిదండ్రులైన వృద్ధులు దయనీయ స్థితిలో ఉన్నారు. ప్రభుత్వాల ద్వారా వచ్చే పెన్షన్లు, సంక్షేమ పథకాలు, బియ్యం లాంటి వాటిపైనే జీవితాలను నెట్టుకొస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరికి ఇవి కూడా చాలక వృద్ధాప్యంలోనూ కాయకష్టం చేయక  తప్పడం లేదు. అలాగే నేడు కరోనా మరణ మృదంగంలో కూడా వృద్ధులు, మధ్యవయస్కుల మరణాలు పెరిగిపోతున్నాయి. 


తెలంగాణలో 60 ఏళ్ళు దాటిన వృద్ధుల్లో 43.3 శాతం మంది జీవనం కోసం కాయకష్టం, కూలినాలి, పొలాల్లో పనో, చిన్నా చితక వ్యాపారమో చేయక తప్పడం లేదు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అంతర్జాతీయ జనాభా శాస్త్ర అధ్యయన కేంద్రం (ఐఐపీఎస్‌)వారు మధ్య వయస్కుల, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంపై సంయుక్తంగా సర్వే నిర్వహించారు. అందులో పురుషులతోపాటు మహిళలు కూడా ఏదో ఒక పనిచేస్తున్నారని తేలింది. వీరిలో వ్యవసాయ రంగంలో 66శాతం మంది, వ్యవసాయేతర పనుల్లో 16 శాతం మంది ఉన్నారు. వృద్ధాశ్రమాల్లోనూ సగటున ఎంతో కొంత జీవనోపాధికై ఆదాయం పొందుతున్నట్లు వెల్లడైంది. ఇందులో పురుషులతో పోల్చితే మహిళల ఆదాయం సగంకన్నా తక్కువని తెలుస్తుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 15.1 శాతం మందికి మాత్రమే విశ్రాంతి ఉద్యోగ ఈపీఎఫ్‌వో పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య, వితంతు పింఛన్లపై 35 శాతం మందికి మాత్రమే అవగాహన ఉంది. 24.8 శాతం మంది వృద్ధాప్య, 41.3 శాతం మంది వితంతు పింఛన్లు పొందుతున్నారు. రాయితీ పథకాలు ఉన్నప్పటికీ వీటిపై అవగాహన లేకపోవడంతో అయిదు శాతం మంది మాత్రమే లబ్ధి పొందుతున్నారు. 


యుక్త వయస్సులోని అహాన్ని, సంపాదన మీద దురాశను వీడి మానవత్వంతో వృద్ధులను చేరదీస్తూ కంటికి రెప్పలా కాపాడవల్సిన బాధ్యత వారి కుటుంబాలది. గౌరవంగా బతికే హక్కు వృద్ధులకు ఉందన్న విషయాన్ని వారి కుటుంబాలు, బంధువులు తెలుసుకోవాలి. మన ఇంట్లో వృద్ధులకు చోటు లేకుండా చేసి వృద్ధాశ్రమాల్లో వేయడం అమానవీయం. అలాగే పాలకులు కూడా తమకు వృద్ధుల పట్ల సామాజిక బాధ్యత వుందనే విషయాన్ని మరువరాదు. వృద్ధాప్యం శాపం కాదు... అనుభవాల ఆస్తి. పండుటాకుల పట్ల నిర్లక్ష్యం వీడుదాం. కడవరకు వీరికి చేయూత నిద్దాం.

మేకిరి దామోదర్‌, వరంగల్‌

Updated Date - 2021-05-06T05:59:28+05:30 IST