ఊరు కాని ఊరిలో...

ABN , First Publish Date - 2020-03-29T12:02:54+05:30 IST

కరోనా వైరస్‌ కలకలంతో ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. వలస కూలీలు.. వ్యాపారులు.. ఇతర

ఊరు కాని ఊరిలో...

వలస కార్మికులకు కష్టాలు

జిల్లా మీదుగా నడిచి వెళ్తున్న ఇతర ప్రాంతీయులు

అడ్డుకుంటున్న పోలీసులు

ఆకలితో అలమటిస్తున్న వైనం

ఇతర రాష్ట్రాల్లో ఉన్న జిల్లా వాసులకూ ఇక్కట్లు


విశాఖపట్టణం నుంచి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి కాలినడకన వెళ్తున్న 17 మంది సంచార దుస్తుల వ్యాపారులను బొబ్బిలిలో పోలీసులు గుర్తించారు. అంతదూరం కాలినడకన వెళ్లలేరని నిలిపేశారు. బొబ్బిలిలోనే తాత్కాలికంగా ఉండాలని సూచించారు. ఆహార ఏర్పాట్లు చేస్తామని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో భోజనం లేక వారు ఇబ్బంది పడుతున్నారు.


విశాఖ నుంచి 260 కిలోమీటర్ల దూరంలోని ఒడిశాలోని పాడువాకు కొంత మంది కూలీలు నడిచి వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా పని ఆపేసిన కాంట్రాక్టర్‌ జీతం కూడా ఇవ్వకుండా వారిని పంపిశాడు. చేసేదిలేక ఆకలితో వారు స్వరాష్ట్రానికి బయలుదేరారు. ఎస్‌.కోట వద్ద మీడియాతో మాట్లాడుతూ గోడు వినిపించారు. 


సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కూలీలు గుంటూరు జిల్లా గోరంట్లలో చిక్కుకున్నారు. వలస వెళ్లిన వారంతా పనులు లేకపోవడంతో స్వగ్రామాలకు బయలుదేరారు. సొంతూరు రావడానికి అనేక అవస్థలు పడుతున్నారు. చివరకు వైసీపీ నేత సాయం కోరారు. ఇలా ఎన్నో కుటుంబాలు చెన్నై, హైదరాబాద్‌, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు వెళ్లి చిక్కుకున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఊరు కాని ఊరు వెళ్లిన వారంతా నరకం చూస్తున్నారు.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ కలకలంతో ఎక్కడికక్కడ రవాణా సదుపాయాలు నిలిచిపోయాయి. వలస కూలీలు.. వ్యాపారులు.. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు స్వస్థలాలకు  చేరుకోలేకపోతున్నారు. అనేక నిరుపేద వర్గాలపై కరోనా ప్రభావం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆకలితో అలమటించేలా చేస్తోంది.  వీరిని ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదు. ఎవరో అధికారి దృష్టిలో పడితే కరుణించడం... ప్రజా ప్రతినిధి కంట పడితే సాయం చేయడం మినహా అభాగ్యులను ఆదుకుని భోజనం పెట్టి, లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకు  ఆదరించే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. విజయవాడ నుంచి కొత్తవలస మీదుగా తెర్లాం వెళుతున్న పాదచారు లను గురువారం జిల్లా అధికారులు గుర్తించారు. వీరు ఆకలితో అలమటిస్తూ వెళ్తున్నారు.


ఈ సమాచారం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో వారికి భోజనం పెట్టి రవాణా ఏర్పాట్లు చేసి పంపించారు. కాని అనేక మంది పేదలు ఎవరి దృష్టిలో పడని పరిస్థితులున్నాయి. ఇటువంటి వారంతా అనేక అవస్థలు పడుతూ వెళ్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే సత్వర చర్యలు చేపట్టాలి. ఇలా నిర్భాగ్యులుగా వెళుతున్న వారికి జిల్లాలో తాత్కాలిక వసతి కల్పించాలి. అన్ని గ్రామాల్లోనూ పాఠశాలలు, అంగన్వాడీలు సెలవులో ఉన్నాయి. వీరికి వసతి కల్పించి భోజన ఏర్పాట్లు చేస్తే ఆపన్నులకు అవస్థలు తప్పే అవకాశం ఉంది. బతలేక వస్తున్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఒక కిలోమీటరు దూరమే నడవలేని పరిస్థితి.


అటువంటిది తలపై వస్తు సామగ్రిని మోస్తూ వందల కిలో మీటర్లు నడుస్తున్నారు. కలెక్టర్‌ ఈ దిశగా ప్రయత్నించి తాత్కాలిక ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎక్కడి వారిని అక్కడే ఉండాలని భావిస్తున్న తరుణంలో ఇలా కాలి నడకన వచ్చే వారికి తాత్కాలిక వసతి కల్పించి గ్రామ స్థాయి ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణలో ఉంచితే వలసదారులకు కొండంత అండ దొరుకుకుందని జిల్లా వాసులు కూడా భావిస్తున్నారు. 


Updated Date - 2020-03-29T12:02:54+05:30 IST