పర్యావరణహితానికి మోడల్‌!

ABN , First Publish Date - 2021-09-06T05:30:00+05:30 IST

ఎర్ర రంగు స్కర్ట్‌ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి... కొండల్లా పేరుకుపోయిన చెత్త కుప్పల మధ్య క్యాట్‌ వాక్‌ చేస్తున్న వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి...

పర్యావరణహితానికి మోడల్‌!

ఎర్ర రంగు స్కర్ట్‌ వేసుకున్న ఓ అందమైన అమ్మాయి... కొండల్లా పేరుకుపోయిన చెత్త కుప్పల మధ్య క్యాట్‌ వాక్‌ చేస్తున్న వీడియో, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. సెలబ్రిటీలు, పర్యావరణవాదుల ప్రశంసలందుకున్న ఈ ప్రయత్నం వెనుక... ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్న వ్యర్థాల సమస్యపై ఆలోచన రేకెత్తించాలన్న సంకల్పం ఉంది. దీని గురించి మోడల్‌, మిస్‌ జార్ఖండ్‌ సురభి ఏమంటోందంటే..


‘‘మహా నగరాలు, పెద్ద పట్టణాల్లో మెయిన్‌ రోడ్లు, కూడళ్ళు అందంగా ఉంటాయి. రాత్రయితే కళ్ళు మిరిమిట్లు గొలిపే రంగురంగుల దీపాలతో విలాసంగా కనిపిస్తాయి. కానీ ప్రధాన ప్రాంతానికి కొంచెం దూరం వెళ్ళి చూస్తే... రోత పుట్టించే వాస్తవాలు కనిపిస్తాయి. దేశంలో ప్రతి చోటా ఉన్న ఈ సమస్య... జార్ఖండ్‌ రాజధాని రాంచీ శివార్లలోనూ ఉంది...

రాంచీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని వ్యర్థాలన్నిటినీ తరలించే డంపింగ్‌ యార్డ్‌... జిరి అనే ప్రాంతంలో ఉంది. ఎప్పుడైనా ఆ ప్రాంతం పక్క నుంచి వెళుతూ ఉంటే భరించరాని దుర్వాసన కమ్మేసేది. చాలాసేపటి వరకూ తేరుకోలేకపోయేదాన్ని. ఆ చుట్టుపక్కల ప్రజలు దుర్భరమైన ఈ కంపును భరించి ఎలా బతుకుతున్నారో అనిపించేది. అయితే, ఇది ఎంత ప్రాణాంతకమైన సమస్యో ప్రాంజల్‌ కుమార్‌ నన్ను కలిసినప్పుడే తెలిసింది.


అందుకే అంగీకరించాను...

నేను ఇంటర్‌ సెకెండియర్‌ పూర్తి చేశాను. మోడలింగ్‌ నా హాబీ.  నిరుడు ‘మిస్‌ జార్ఖండ్‌-2020’ పోటీల్లో పాల్గొని టైటిల్‌ గెలుచుకున్నాను. కొందరు సామాజిక కార్యకర్తలతో కలిసి వివిధ సమస్యలపై పని చేస్తూ ఉంటాను. కొన్నాళ్ళ కిందట ప్రాంజల్‌ నన్ను కలుసుకున్నారు. ఆయన ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌. జిరీ డంపింగ్‌ యార్డ్‌ సమస్య గురించి వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం... మన దేశంలో ఏడాదికి ఆరు కోట్ల ఇరవై లక్షల టన్నులకి పైగా చెత్త తయారవుతోంది.  దీనిలో 75 శాతం వరకూ శుద్ధి కావడం లేదు. మూడు కోట్ల టన్నులకు పైగా చెత్తను నేరుగా డంపింగ్‌ యార్డులకి తరలిస్తున్నారు. వాటి సామర్థ్యానికి మించిన చెత్త ఇప్పటికే వాటిలో పోగుపడింది. అది ప్రాణాంతకంగా తయారవుతోంది. మా రాంచీలోని అన్ని ప్రాంతాల నుంచీ సేకరించిన రెండు లక్షల టన్నులకు పైగా చెత్తను జిరీ డంపింగ్‌ యార్డ్‌లో పడేశారన్నది ఒక అంచనా. ఆ యార్డు చుట్టూ దాదాపు పదివేలమంది నివసిస్తున్నారు. చెత్త వల్ల ఏర్పడుతున్న కాలుష్యంతో వందల మంది తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. రింగ్‌ రోడ్డు బయట ఉన్న ఈ ప్రదేశాన్ని గ్రీన్‌ ఫీల్డ్‌గా ప్రకటించారు. కానీ దాన్ని చెత్తను డంప్‌ చేసే ప్రదేశం కింద మార్చేశారు. ఈ వివరాలన్నీ చెప్పిన తరువాత... ‘‘ఇప్పటికైనా మనం మేలుకోకపోతే రాంచీ నగరం భయానకమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మామూలుగా అయితే ఆ చెత్త కుప్పల ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ఎన్ని పెట్టినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ దానికి ఫ్యాషన్‌ జోడిస్తే ప్రపంచం దృష్టి దీనిమీద పడుతుంది. అందుకే ముక్కూ, నోరూ మూసుకోకుండా దాటడం అసాధ్యమైన డంపింగ్‌ యార్డ్‌లో ఫ్యాషన్‌ షూట్‌ జరపాలన్న ఆలోచన వచ్చింది’’ అని ప్రాంజల్‌ చెప్పారు. ‘‘నేను కొందరు మోడల్స్‌ను అడిగాను. ‘నీకేమైనా పిచ్చెక్కిందా?’ అన్నట్టు చూశారు. ‘‘చెత్త కుప్పల మీద నడవడమా?’’ అంటూ అసహ్యంగా ముఖం పెట్టారు. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌కు మీరు మోడల్‌గా ఉంటారా?’’ అని అడిగారు. ఆయన చెప్పిన మాటలు నాకు దిగ్ర్భాంతి కలిగించాయి. సమస్య తీవ్రతను కళ్ళకు కట్టాయి. అందుకే మరో మాట లేకుండా అంగీకరించాను. 


స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చింది...

సుమారు 210 అడుగుల ఎత్తు నుంచి డ్రోన్‌ ద్వారా ఆ వీడియో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు. ఎర్ర రంగు స్కర్ట్‌, స్లిప్పర్స్‌ మాత్రమే ధరించి అందులో పాల్గొన్నాను. సకాలంలో స్పందించకపోతే ఈ సమస్య చాలా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని అధికారులను అప్రమత్తం చెయ్యడానికే ఎర్ర రంగు దుస్తులు ఎంపిక చేసుకున్నాం. షూటింగ్‌ కోసం అక్కడికి వెళ్ళినప్పుడు, కనీసం ముక్కుకు అడ్డంగా మాస్కయినా లేకుండా గడపడం చాలా కష్టమైపోయింది. దాదాపు గంట సేపు అక్కడ చిత్రీకరణ జరిగింది. వెళ్ళిన కొద్దిసేపటికే... ఆ వాసనలకు తల తిరిగిపోయింది. పారిపోదామనిపించింది. కానీ ఇది సామాజిక సమస్య. అది పరిష్కారం కావాలంటే దాని గురించి గట్టిగా చాటి చెప్పడమే మార్గం. అందుకే షూట్‌ పూర్తి చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాను. అయితే షూట్‌ చేస్తున్నప్పుడు నరకం అంటే ఏమిటో తెలిసొచ్చింది. అడుగు పెడితే కాళ్ళు కూరుకుపోతూ... చెత్త కుప్పల మీద నడిచిన ఆ అనుభవం భయానకం. చిన్న చిన్న కీటకాలు, కంటికి కనబడని క్రిముల మధ్య నడవడంతో చర్మం కందిపోయింది, దద్దుర్లు వచ్చాయి. డాక్టర్‌ని కలిస్తే... స్కిన్‌ ఇన్ఫెక్షన్‌ అని చెప్పి, చికిత్స చేశారు. 


అధికారుల్లో కదలిక వచ్చింది...

ఆ వీడియో, ఫొటోలు బయటకు రాగానే వైరల్‌ అయ్యాయి. ప్రజలు, ప్రభుత్వం, అధికారులు, పర్యావరణవాదుల్లో ఈ సమస్యపై చర్చ రేకెత్తించాలన్న మా ఉద్దేశం ఫలించింది. అంతర్జాతీయ సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు, వాతావరణ మార్పుల సమస్య మీద పని చేస్తున్న వారితో సహా ఎందరో సానుకూలంగా స్పందించారు. మమ్మల్ని అభినందించడమే కాదు... సరికొత్త ఆలోచన చేశారంటూ ప్రశంసించారు. ఈ వీడియో జార్ఖండ్‌ అధికార వర్గాల్లోనూ కదలిక తెచ్చింది. జిరీలో రీసైక్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని, వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి లాంటి చర్యలు తీసుకుంటామనీ రాంచీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. మరోవైపు ‘ఎన్విరాన్‌మెంటల్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీల కోసం ఈ ఫొటోను ఎంట్రీగా పంపించాం. ఈ పోటీకి 119 దేశాల నుంచి ఏడు వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. వాతావరణ మార్పులపై నవంబర్‌లో ఐక్యరాజ్య సమితి నిర్వహించే సదస్సులో విజేతలను ప్రకటిస్తారు. ఏది ఏమైనా, మా బాధ్యతను మేము నెరవేర్చామనుకుంటున్నాం.  మోడలింగ్‌నూ పర్యావరణహితానికి కూడా అర్థవంతంగా ఉపయోగించవచ్చని మా ప్రయత్నం నిరూపించింది. ప్రస్తుతం మరి కొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నాను. మహిళలపై సాగుతున్న వేధింపుల గురించి ఫ్యాషన్‌ ఫొటోగ్రఫీ ద్వారా చెప్పబోతున్నాం.’’

Updated Date - 2021-09-06T05:30:00+05:30 IST