నందిత బాన... ఈ పేరు ప్రస్తుతం సింగపూర్‌లో మారుమోగిపోతోంది

ABN , First Publish Date - 2021-12-20T13:45:19+05:30 IST

‘స్ట్రెయిట్‌ టైమ్స్‌’ లాంటి ప్రముఖ పత్రికలు కూడా ఆమె గురించి కథనాలు ప్రచురిస్తున్నాయి. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేఈ నందిత ఎవరు? అని ఆలోచిస్తున్నారు కదా.. మిస్‌ సింగపూర్‌గా ఎంపికై... మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సెమీ ఫైనల్స్‌ దాకా వెళ్లిన తెలుగు అమ్మాయి. గత 34 ఏళ్లలో సింగపూర్‌ నుంచి

నందిత బాన... ఈ పేరు ప్రస్తుతం సింగపూర్‌లో మారుమోగిపోతోంది

నందిత బాన... ఈ పేరు ప్రస్తుతం సింగపూర్‌లో మారుమోగిపోతోంది. ‘స్ట్రెయిట్‌ టైమ్స్‌’ లాంటి ప్రముఖ పత్రికలు కూడా ఆమె గురించి కథనాలు ప్రచురిస్తున్నాయి. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడేఈ నందిత ఎవరు? అని ఆలోచిస్తున్నారు కదా..  మిస్‌ సింగపూర్‌గా ఎంపికై... మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సెమీ ఫైనల్స్‌ దాకా వెళ్లిన తెలుగు అమ్మాయి. గత 34 ఏళ్లలో సింగపూర్‌ నుంచి ఏ అమ్మాయి మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో సెమీ ఫైనల్స్‌ దాకా వెళ్లలేదు. దీంతో సింగపూర్‌లో నందితకు విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది. ‘‘నాకు సమంత, అనుష్క, రామ్‌చరణ్‌ సినిమాలంటే ఇష్టం. మా ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. ‘మిస్‌ యూనివర్స్‌’గా ఎంపికయిన హర్నాజ్‌ సంధూ నాకు మంచి  మిత్రురాలు’’ అంటున్న నందిత - సింగపూర్‌ నుంచి ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.


‘‘ఈ సారి మిస్‌ యూనివర్స్‌ పోటీలు ఇజ్రాయెల్‌లో జరిగాయి. కొవిడ్‌ వల్ల వాతావరణమంతా చాలా టెన్షన్‌గా అనిపించింది. ఒమైక్రాన్‌ వ్యాప్తి వల్ల ఇజ్రాయెల్‌లో కొవిడ్‌ నిబంధనలను చాలా కఠినతరం చేశారు. దీని వల్ల అమ్మనాన్నలతో సహా చాలా మంది పోటీలు చూడటానికి రాలేకపోయారు. అయితే ఒకసారి బరిలో దిగిన తర్వాత వాతావరణం తేలికపడింది. మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో అనేక రౌండ్స్‌ ఉంటాయి. ప్రతి రౌండ్‌లోను కొందరిని తొలగిస్తూ ఉంటారు. అలా నేను సెమీఫైనల్స్‌ దాకా వెళ్లగలిగా. సెమీ ఫైనల్స్‌లో నా పేరు వినిపించగానే షాక్‌ తిన్నా. కొన్ని సెకన్లు ‘నేను విన్నది నిజమేనా?’ అనిపించింది. ఈ పోటీల గురించి నేను చాలా శ్రమపడ్డా. జడ్జీలు నా శ్రమను గుర్తించినందుకు చాలా ఆనందం కలిగింది. నేను పుట్టింది... పెరిగింది సింగపూర్‌లోనే.. ఆ దేశపు జెండాకు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఫీలయ్యా. ఆ తర్వాత స్విమ్‌ సూట్‌ పోటీ జరిగింది. ఆ తర్వాతి రౌండ్‌ ఫైనల్స్‌. దానికి నేను ఎంపిక కాలేదు. నాకు చాలా నిరాశ కలిగింది. కానీ సెమీ ఫైనల్స్‌ దాకా వచ్చాననే తృప్తి మిగిలింది. గత 34 ఏళ్లలో సింగపూర్‌కు చెందిన ఏ అమ్మాయి సెమీ ఫైనల్స్‌ దాకా వెళ్లలేదు. నేను సెమీ ఫైనల్స్‌కు వెళ్లాననే విషయం తెలిసిన వెంటనే స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగువారు- నేను గెలవాలని కోరుతూ అనేక సందేశాలు పంపారు. శుక్రవారం రాత్రి సింగపూర్‌కు తిరిగి వచ్చినప్పుడు నాకు లభించిన స్వాగతం చూస్తే- చాలా సంతోషం కలిగింది. 


‘‘మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయిన హర్నాజ్‌ సంధూ, నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్లం. నాకు చాలా మంచి స్నేహితురాలు. ఖాళీ సమయాల్లో కలిసి హిందీలో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మేమిద్దరం ఒకే విధమైన విలువలతో పెరిగాం. ఇద్దరివీ భారతీయ మూలాలే...’’



అంత సులభం కాదు..

చాలా మంది అందాల పోటీలంటే చాలా సులభమనుకుంటారు. కానీ దీని వెనక చాలా శ్రమ ఉంటుంది. పోటీలలో మన ప్రతి మాటను, ప్రతి కదలికను అంచనా వేస్తూ ఉంటారు. ఒక్క తప్పు చేసినా- ఫలితం దక్కదు. అందువల్ల పోటీలకు చాలా ప్రిపేర్‌ కావాల్సి ఉంటుంది. నేను కూడా ఈ పోటీలకు బాగా ప్రిపేర్‌ అయి వెళ్లా. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత నా ప్రిపరేషన్‌ కొంత వరకూ మాత్రమే పనికొచ్చింది. నాలాంటి అనేకమంది అమ్మాయిలు ఈ పోటీకి వచ్చారు. ఒకొక్కరిది ఒకో కథ. వారి జీవితాల నుంచి, అనుభవాల నుంచి అనేక కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. అక్కడికి వచ్చినవారందరూ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను గెలుచుకోవటానికి వచ్చినవారే! ఈ లక్ష్యాన్ని చేరటం కోసం వారెంత కష్టపడ్డారో గమనిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. నేను కూడా మరింత కష్టపడాలనే భావన కలిగేది. దీనితో పాటు... మనం నిబద్ధతతో నిజాయతీగా ఉంటే ఫలితాలు దక్కుతాయనే విషయం అర్థమయింది. ఈ పోటీలలో అనేకమంది పాల్గొంటూ ఉంటారు. ఒకొక్కరిది ఒకో రకమైన వ్యక్తిత్వం. ఇతరులతో పోల్చుకుంటూ ఉంటే మనం ఎదగలేం. నందిత- నందితలాగానే ప్రవర్తించాలి. అంతే తప్ప మరొకరికి నకలులా ఉండటానికి ప్రయత్నించకూడదు. మనం స్వచ్ఛంగా, నిజాయతీగా ఉంటే అందరూ వారంతట వారే మన దగ్గరకు వస్తారు. పోటీలు ప్రారంభమైప్పటి నుంచి నేను నాలాగే ఉన్నా. జడ్జీలు నన్ను రకరకాల ప్రశ్నలు అడిగినప్పుడు నిజాయతీగా సమాధానాలు చెప్పా. ఈ నిజాయతీయేనన్ను సెమీఫైనల్స్‌కు చేర్చింది.


నావి తెలుగు మూలాలే!

సుమారు 25 ఏళ్ల క్రితం అమ్మనాన్న సింగపూర్‌ వచ్చేశారు. నేను సింగపూర్‌లోనే పుట్టాను. ఇక్కడే చదువుకుంటున్నా. అయితే మా ఇంట్లో మాత్రం తెలుగే మాట్లాడతాం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలే పాటిస్తాం. తెలుగు సినిమాలూ చూస్తాం. నాకు రామ్‌చరణ్‌, అనుష్క, సమంత అంటే చాలా ఇష్టం. వారి సినిమాలు తప్పనిసరిగా చూస్తా. నాకు చిన్నప్పటి నుంచి మోడలింగ్‌ అన్నా, గ్లామర్‌ అన్నా చాలా ఇష్టం. అందుకే ఒక వైపు చదువుకుంటూనే దీన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. అమ్మనాన్నలు నా నిర్ణయాన్ని గౌరవించారు. నన్ను అనేక రకాలుగా ప్రోత్సాహించారు. ఇక నా భవిష్యత్తు విషయానికి వస్తే- ప్రస్తుతం నేను డిగ్రీ చదువుతున్నా. డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంటర్నేషనల్‌ మోడలింగ్‌ సర్క్యూట్‌లో భాగమవ్వాలనుకుంటున్నా. నేను మిస్‌ యూనివర్స్‌ పోటీలకు వెళ్తున్నానని తెలిసిన తర్వాత అనేక మంది - ‘‘నువ్వు సినిమాల్లోకి వెళ్తావా?’’ అని అడుగుతున్నారు. ప్రస్తుతం అయితే అలాంటి ఆలోచనలేవీ లేవు. కేవలం మోడలింగ్‌పైనే దృష్టి కేంద్రీకరించాలనుకుంటున్నా.’’




Updated Date - 2021-12-20T13:45:19+05:30 IST