వారం పోయి.. 117 వారాలు

ABN , First Publish Date - 2021-08-02T08:15:52+05:30 IST

మాటతప్పను.. మడమ తిప్పను.. గద్దెనెక్కిన వారంలో కంట్రిబ్యూషనరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) రద్దు చేస్తానని పాదయాత్రలో పదేపదే చెప్పిన నేటి సీఎం, నాటి విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి

వారం పోయి..  117 వారాలు

సీపీఎస్‌పై మాట తప్పిన జగన్‌

ఏడ్రోజుల్లో రద్దు చేస్తానంటూ

పాదయాత్రలో ప్రచారం

హామీతో ప్రభుత్వ ఉద్యోగులకు గేలం

అధికారంలోకి వచ్చి రెండేళ్లు

గడచినా అతీగతీ లేని సీపీఎస్‌ రద్దు

కమిటీల పేరుతో కాలయాపన 

నేటి నుంచి ఉద్యోగుల ఉద్యమం

7వ తేదీ వరకు వారోత్సవాలు

8న ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు

15న సీఎం, ప్రభుత్వ పెద్దలకు

‘సామాజిక’ సందేశాలు 

సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో

‘విద్రోహ దినం-నయవంచన సభలు’

షెడ్యూల్‌ ప్రకటించిన ఏపీసీపీఎస్‌ఈఏ 


సీపీఎస్‌ రద్దుకు సంబంధించి జగన్‌ ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేయడంపై మండిపడుతున్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని పాదయాత్ర సమయంలో మభ్యపెట్టి తమ ఓట్లు దండుకుని.. ఇప్పుడు రెండేళ్లు దాటినా దాని ఊసే ఎత్తడంలేదని ఆవేదన చెందుతున్నారు. దీనిపై సోమవారం నుంచి నెలపాటు ఉద్యమం చేపట్టనున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాటతప్పను.. మడమ తిప్పను.. గద్దెనెక్కిన వారంలో  కంట్రిబ్యూషనరీ పెన్షన్‌ విధానం (సీపీఎస్‌) రద్దు చేస్తానని పాదయాత్రలో పదేపదే చెప్పిన నేటి సీఎం, నాటి విపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. ఆయన అధికారం చేపట్టి 26 నెలలు.. అంటే 117 వారాలైంది. ఇప్పటికీ సీపీఎస్‌ రద్దు కాలేదు. అధికారంలోకి వచ్చిన వారంలోనే.. ఎలాంటి కమిటీలు వేయకుండారద్దు చేస్తామని చెప్పారని.. ఇన్ని వారాలు దాటినా పట్టించుకోకపోవడం.. మాట తప్పడం- మడమ తిప్పడం కాదా అని సీపీఎస్‌ ఉద్యోగులు నిలదీస్తున్నారు. రెండేళ్లు గడచినా హామీ అమలు చేయకపోగా కమిటీల పేరుతో సాగదీస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు.


ఈ మేరకు ‘ఆంధ్రప్రదేశ్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎ్‌సఈఏ)’ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. సోమవారం నుంచి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించనుంది. ‘క్విట్‌ సీపీఎస్‌’ పేరుతో ఆగస్టు 8న శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేయనుంది. 15న సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దల్ని ట్యాగ్‌ చేస్తూ సందేశాలు పంపించనుంది. 16 నుంచి 21వ తేదీ వరకూ మధ్యాహ్న సమయంలో ఉద్యోగులు నిరసనలు చేపడతారు. సెప్టెంబరు 1న అన్ని జిల్లా కేంద్రాల్లో ‘పింఛను విద్రోహ దినం-నయవంచన సభలు’ నిర్వహిస్తామని షెడ్యూల్‌ విడుదల చేసింది. 


ఏళ్లు గడిచినా ఎదురుచూపులే.. 

రాష్ట్రంలో 1,94,000 మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. ప్రతి నెలా వారి వేతనాల్లో నుంచి బేసిక్‌ పే ప్లస్‌ డీఏలో 10 శాతం మినహాయిస్తారు. అంతే మొత్తం ప్రభుత్వం కలుపుతోంది. అంటే.. ఏటా సీపీఎస్‌ ఉద్యోగుల వేతనాల్లో నుంచి రూ.800-1,000 కోట్లు చెల్లిస్తున్నారు. అదే పాత పెన్షన్‌ విధానంలో అయితే ఉద్యోగులు పైసా కూడా చెల్లించనక్కర్లేదు. రిటైరయ్యేనాటికి వచ్చే వేతనంలో 50 శాతం పెన్షన్‌గా వచ్చేది. సీపీఎస్‌ ఉద్యోగులకు మాత్రం రూ.5 వేలకు మించి రావడం లేదు. సీఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేసి ఉంటే.. తమ వేతనాల నుంచి ఈ 26 నెలల్లో సుమారు రూ.2,500 కోట్లు వాటాగా చెల్లించే అవసరం ఉండేది కాదని ఉద్యోగులు వాపోతున్నారు.


2004 నుంచి నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలవుతున్న సీపీఎస్‌ వల్ల సామాజిక, ఆర్థిక భద్రత కోల్పోయామని, పాత పింఛను విధానాన్నే అమలు చేయాలని వారు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో వారి ఓట్లు కీలకం కావడంతో.. జగన్‌ పాదయాత్ర చేసే సమయంలో.. అధికారంలోకి రాగానే కమిటీలు లేకుండా వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. నమ్మిన దాదాపు 2లక్షల ఉద్యోగుల కుటుంబాలు వైసీపీ వైపు మొగ్గు చూపాయి. జగన్‌ తన మొదటి కేబినెట్‌ సమావేశంలోనే సూత్రప్రాయంగా సీపీఎస్‌ రద్దు అని చెప్పారని, అసెంబ్లీ సాక్షిగా దానికే కట్టుబడి ఉన్నామని చెప్పి.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించారని వాపోతున్నారు. ‘సీపీఎస్‌ రద్దుపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. సీఎస్‌ ఆధ్వర్యంలో ఐఏఎస్‌ల కమిటీ వేశారు.


ఆ కమిటీ కాల పరిమితీ ముగిసిపోయింది. తర్వాత అధ్యయనానికి ముంబైకి చెందిన పండిట్‌ కన్సల్టెన్సీ, ఏపీఎన్‌ఐసీని ప్రభుత్వం నియమించింది.. ఇలా ఎప్పటికప్పుడు కమిటీలతో కాలక్షేపం చేస్తోంది’ అని మండిపడుతున్నారు. ఇప్పటి వరకు 2 వేల మంది వరకు సీపీఎస్‌ ఉద్యోగులు పదవీ విరమణ చేసి ఉంటారని అంచనా. మరణించిన వారి సంఖ్య 300 వరకు ఉండవచ్చు. సీపీఎస్‌ విధానంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అత్యధిక పెన్షన్‌ రూ.5 వేలకు మించి రావడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. రూ.500 పింఛను కూడా వచ్చేవారు ఉన్నారని చెబుతున్నారు.


సీఎం మాట నిలబెట్టుకోవాలి..

’అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్‌ రద్దు చేస్తామంటే విశ్వసించాం. రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల సీపీఎస్‌ కుటుంబాలు ఆయనకు బాసటగా నిలిచాయి. ఇప్పటికే రెండేళ్లు గడచిన నేపథ్యంలో సీఎం హామీ నిలబెట్టుకోవాలని నినదిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్‌ ఉద్యోగులు ఉద్యమబాట పడుతున్నారు.’

రామాంజనేయులు యాదవ్‌, ఏపీసీపీఎస్‌ఈఏ అధ్యక్షుడు


రెండింటికీ చెడ్డారు!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ పెన్షన్‌ విధానం (ఎన్‌పీఎస్‌) చట్టం అమలుకు నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం.. సీపీఎస్‌ విధానాన్ని తీసుకొచ్చింది. కేంద్రం మొదట ఎన్‌పీఎ్‌సలో ఉద్యోగి వాటాను బేసిక్‌ ప్లస్‌ డీఏలో 10 శాతంగా నిర్ణయించింది. అదే విధంగా 10 శాతాన్ని రాష్ట్రప్రభుత్వం చెల్లించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాల్లోనూ సీపీఎస్‌ విధానంపై ఉద్యోగులు వ్యతిరేకత వ్యక్తంచేస్తుండడంతో 2019 ఏప్రిల్‌లో కేంద్రం సవరణ తెచ్చింది. 2019 ఏప్రిల్‌ నుంచి ఉద్యోగి చెల్లించాల్సిన వాటాను 10 శాతంగానే ఉంచి, ప్రభుత్వ వాటాను మాత్రం 14 శాతానికి పెంచింది.


అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అది అమలు చేయలేదు.  కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అడాప్ట్‌ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కాలక్రమంలో కేందకరం ఆ చట్టంలో చేసే మార్పుచేర్పులనూ అమలు చేయాల్సి ఉండగా.. అలా చేయడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. దాంతో తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి చందంగా మారిందని అంటున్నారు. సీపీఎస్‌ ఉద్యోగి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బులు వేయడం ఆలస్యం చేస్తే.. సీపీఎస్‌ పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీ ఎంత ఉంటుందో అంత ఆలస్యమైన కాలానికి వడ్డీతో కలిపి ఉద్యోగి ఖాతాలో వేయాల్సి ఉంటుందని.. అదీ ప్రభుత్వం చేయడంలేదు.

Updated Date - 2021-08-02T08:15:52+05:30 IST