గాడి తప్పిన పాలన

ABN , First Publish Date - 2021-08-31T07:47:54+05:30 IST

ప్రభుత్వ నిర్ణయాల్లో గందరగోళంతో జిల్లాలో చాలాకాలంగా పాలన గాడి తప్పింది.

గాడి తప్పిన పాలన
గంగాధరనెల్లూరు మండలంలో రూ.40 లక్షలతో పాఠశాల ఆవరణలో నిర్మించి ఇటీవల ఖాళీ చేసిన పాపిరెడ్డిపల్లె సచివాలయం

ఆగిన అభివృద్ధి పనులు

ఆందోళన బాటలో పలు వర్గాలు


చిత్తూరు, ఆంధ్రజ్యోతి: ప్రభుత్వ నిర్ణయాల్లో గందరగోళంతో జిల్లాలో చాలాకాలంగా పాలన గాడి తప్పింది. ఒకవైపు అభివృద్ధి పనులన్నీ ఆగిపోగా మరోవైపు పలు సమస్యలకు పరిష్కారం  లభించక వివిధ వర్గాలు ఆందోళన బాటపట్టాయి.ఈ పరిస్థితుల్లో మంగళవారం జిల్లా అభివృద్ధిపై తిరుపతిలో సమీక్షా సమావేశం జరగనుంది.ఈ సమావేశంతోనైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని జనం ఆశిస్తున్నారు.


వృథాగా మారనున్న రూ.కోట్ల నిధులు

పాఠశాలల ఆవరణలో సచివాలయాల వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఉండకూడదని కోర్టు అక్షింతలు వేసిన నేపథ్యంలో 88 చోట్ల సచివాలయాలను, రైతు భరోసా కేంద్రాలను, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లను ఇతరప్రాంతాల్లోకి మారుస్తున్నారు.ఉపాధి హామీ నిధులతో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా జిల్లాకు రూ.376.75 కోట్లతో 1016 సచివాలయాలు, రూ.201.43 కోట్లతో 924 రైతు భరోసా కేంద్రాలు, రూ.126.17 కోట్లతో రూ.721 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వాటి నిర్మాణాలు సగానికిపైగా పూర్తయ్యాయి. గతేడాది కోర్టు చెప్పిన సమయానికి కొన్ని ప్రారంభం కాలేదు. అప్పుడే స్థల మార్పిడి చేసి వేరొకచోట్ల నిర్మాణాలు చేపట్టి ఉంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పాఠశాలల ఆవరణలో నిర్మించిన భవన నిర్మాణాలు వృథా అయ్యేవికాదు 


శుభ్రత లేమి.. పాఠశాలల్లో కరోనా భయం

 కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా భయంతోనే విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. చాలాచోట్ల పాఠశాలల్లో కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 5120 మంది ఆయాలకు ఫిబ్రవరి నుంచి జీతాలు చెల్లించలేదు. దీంతో ఆయా పాఠశాలల్లో శుభ్రతా చర్యలు లోపించాయి. పాఠశాలలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తే మంచిదని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎక్కడా విద్యార్థుల మధ్య భౌతికదూరం కనిపించడం లేదు.పాఠశాలలు తెరచుకున్న తర్వాత 25 మంది ఉపాధ్యాయులకు, 12 మంది విద్యార్థులకు కరోనా సోకింది.


విలీనంపై కనిపించని స్పష్టత

జాతీయ నూతన విద్యావిధానంపై స్పష్టత కనిపించడం లేదు. విలీనం పేరుతో 377 అంగన్‌వాడీ కేంద్రాలను, 261 ప్రాథమిక పాఠశాలలను మూత వేసేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ఏ తరగతులను ఏ పాఠశాలలో విలీనం చేస్తున్నారు.. అంగన్‌వాడీడీ కేంద్రాలను విలీనం చేశాక ప్రాథమిక పాఠశాలతో కలిసి పనిచేయాలా.. వంటి అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ విధానానికి వ్యతిరేకంగా ఇటు అంగన్‌వాడీలు.. అటు ఉపాధ్యాయులు నిత్యం నిరసన వ్యక్తం చేస్తున్నా ఫలితం లేదు.


కిందిస్థాయి సిబ్బందిలో భయం

జిల్లాలో 2685 గ్రామ సంఘాలుండగా.. అదే స్థాయిలో యానిమేటర్లు పనిచేస్తున్నారు. తాజాగా  సంఘంలో కనీసం 30డ్వాక్రా గ్రూపులుండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలా జిల్లాలో 429 వరకు గ్రామ సంఘాలు తగ్గనున్నాయి. ఇదే స్థాయిలో యానిమేటర్ల సంఖ్య తగ్గనుంది.రూ.10 వేల గౌరవ వేతనాన్ని తీసుకుంటున్నారనే కారణంగా ఆశా వర్కర్లకు అన్ని రకాల ప్రభుత్వ పథకాలను దూరం చేశారు. దీంతో జిల్లాలోని 3550 మంది ఆశా వర్కర్లు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే 5120 మంది ఆయాలకు రూ.6 వేలు ఆశ చూపి.. రూ.వెయ్యి ఇచ్చారు. దీంతో చేసేదేమీలేక నిరాశ పడుతున్నారు.


పనులు పూర్తికాకుండానే టోల్‌ వసూలు

చిత్తూరు- తిరుపతి రహదారి మీద గాదంకి వద్ద టోల్‌ గేటును ఏర్పాటుచేశారు. 61కిలోమీటర్లకు గానూ 50 కిలోమీటర్ల రహదారి మాత్రమే పూర్తయింది. మిగిలిన రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయకుండానే టోల్‌గేటును ఏర్పాటుచేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే గుడిపాల మండలంలోని తమిళనాడు సరిహద్దు నుంచి గంగవరం మండలంలోని కర్ణాటక సరిహద్దు వరకు (చెన్నై-బెంగళూరు) జాతీయ రహదారి నిర్మాణం కూడా సగమే పూర్తయింది. ఇక్కడా అదే పరిస్థితి. రోడ్డు పూర్తి చేయకనే మహాసముద్రం వద్ద టోల్‌గేటును ఏర్పాటుచేశారు. ఇక్కడ మరీ దారుణంగా వాహనదారులకు ఎలాంటి సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదు.


ఇతర శాఖల అధికారులతో పాలన

జిల్లాలోని కీలక శాఖల అధికారుల పోస్టులో సంబంధంలేని అధికారులు కూర్చున్నారు. ఈ కారణంగా పాలన గాడి తప్పుతోంది. డ్వామాలో జైళ్ల శాఖ, డీఆర్‌డీఏలో కమర్షియల్‌ ట్యాక్స్‌, జిల్లా పంచాయతీలో ఉద్యానవన శాఖ.. ఇలా ఏ శాఖ చూసుకున్నా.. ఇతర శాఖల నుంచి వచ్చిన అధికారులు ఉన్నారు. ఆయా శాఖల్లో వారికి సరైన పట్టు లేకపోవడంతో ఆయా శాఖలు, విభాగాలు రాష్ట్రంలో వెనుకబడ్డాయి. ఓ ఎంపీడీవోను జడ్పీలో కీలక హోదాలో కూర్చోబెట్టడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఇక కీలక స్థాయి జిల్లా అధికారులు సచివాలయాలను తనిఖీ చేయడం తప్ప.. బయట కనిపించడం లేదు.

అర్హులైన రైతులందరికీ జలకళ పథకం కింద ఉచితంగా బోర్లు వేయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. జిల్లాలో 14,284 మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే 1217 మందికి మాత్రమే బోర్లు మంజూరయ్యాయి. 269 మంది రైతుల పొలాల్లో మాత్రమే బోర్లు వేశారు.

మొదటిసారి గర్భిణిగా నమోదైన మహిళలకు విడతలవారీగా రూ.5 వేలు చొప్పున పీఎం మాతృత్వ వందన          యోజన పథకం కింద అందించేవారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ పథకం ద్వారా రూ.1.57 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉన్నాయి. 3140 మందికి పైగా సాయం కోసం  ఎదురుచూస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా సాగిన జాతీయ రహదారుల అభివృద్ధి పనుల్లో కొన్ని ఆగిపోగా.. మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. చిత్తూరు- పలమనేరు జాతీయ రహదారి పనులు సగం వరకు పెండింగ్‌లో ఉన్నాయి. మదనపల్లె- పలమనేరు, మదనపల్లె- రాయచోటి వంటి జాతీయ రహదారి పనుల్లో ఎలాంటి పురోగతి     లేదు.

ప్రభుత్వ ఇళ్లను నిర్మించుకునేందుకు అక్కడక్కడా లబ్ధిదారులు ముందుకు వస్తున్నా.. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో వారంతా నిరాశ చెందుతున్నారు. జిల్లాకు రూ.98.02 కోట్లకుగానూ రూ.38.08 కోట్ల బిల్లులు మంజూరయ్యాయి. జూలై 16 నుంచి రూ.59.94 కోట్ల బిల్లులు పెండింగులో ఉన్నాయి.


నేడు తిరుపతిలో డీఆర్సీ సమావేశం

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 30: జిల్లా సమీక్షా కమిటీ(డీఆర్సీ) సమావేశం తిరుపతిలో మంగళవారం జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ సెనేట్‌ హాలులో ఉదయం 10.30 గంటలకు సమావేశం జరపనుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గౌతంరెడ్డి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితర ఉన్నతాధికారులంతా పాల్గొంటారు.ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్మం శాసన మండలి ప్రొటెం స్పీకర్‌ కావడంతో వేదికపై ఇన్‌ఛార్జి మంత్రితో పాటు ప్రత్యేక స్థానం కల్పించనున్నారు.ప్రతిపక్షం తరపున ఎమ్మెల్సీలు దొరబాబు, యండపల్లె శ్రీనివాసులు ప్రజల పక్షాన గళం విప్పే అవకాశముంది. ప్రత్యేక ఆహ్వానితులుగా డీసీసీబీ చైర్‌పర్సన్‌ రెడ్డెమ్మ, సీడీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ నాగలక్ష్మి తొలిసారిగా డీఆర్సీ సమావేశంలో పాల్గొననున్నారు.ప్రధానంగా నాడు-నేడు, కొవిడ్‌ నియంత్రణ, థర్డ్‌వేవ్‌, ఉపాధి హామీ, విద్యుత్‌, గృహ నిర్మాణం, నీటిపారుదలశాఖల అంశాలతో అజెండాను రూపొందించారు. వీటితో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిపై ప్రజా ప్రతినిధులు చర్చించనున్నారు.

Updated Date - 2021-08-31T07:47:54+05:30 IST