Abn logo
Sep 26 2021 @ 00:11AM

అడవిలో తప్పిపోయిన బీట్‌ అఫీసర్‌

రామయ్యతో రెస్క్యూ ఆపరేషన సిబ్బంది

రెండురోజులు అడవిలోనే..

పోలీస్‌, ఫారెస్టు అధికారుల రెస్క్యూ ఆపరేషనతో ఆచూకీ లభ్యం

మైదుకూరు రూరల్‌, సెప్టెంబరు 25: తోటి సిబ్బందితో కలసి నల్లమల అడవిలోకి వెళ్లి  తప్పిపోయిన బీట్‌ ఆఫీసర్‌ చివరకు పోలీస్‌, అటవీ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన రెస్క్యూ ఆపరేషనతో ఎట్టకేలకు దొరికారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. వనిపెంట అటవీ కార్యాలయంలో అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రామయ్య గురువారం తోటి సిబ్బందితో కలసి నల్లమల అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌కోసం వెళ్లి తప్పిపోయారు. రాత్రి వరకు ఆయన కోసం వెతికి కనిపించక పోవడంతో సిబ్బంది వెనుతిరిగి వచ్చి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం కూడా రాకపోవడంతో డీఎస్పీ విజయకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య ఆధ్వర్యంలో శనివారం ఉదయం అడవిలోకి వెళ్లారు. వీరితో పాటు మైదుకూరు, పోరుమామిళ్ల, బద్వేలు సీఐలు చలపతి, మోహన్‌రెడ్డి, రమేష్‌బాబు, ఎస్‌ఐలు రఫీ, శ్రీనివాసులు, రామాంజనేయులు,  పోలీస్‌ సిబ్బంది, స్పెషల్‌ పార్టీ, డాగ్‌ స్క్వాడ్‌, అటవీ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్‌తో  అడవిని జల్లెడ పట్టడం ప్రారంభించారు. అప్పటికే ఎత్తైన ప్రదేశం చేరుకున్న బీట్‌ ఆఫీసర్‌ రామయ్య సెల్‌ సిగ్నల్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో, అధికారులు అక్కడికి వెళ్లి ఆయనను సురక్షితంగా తీసుకు వచ్చారు.