మాయమైన ఇసుక పీలేరులో డోర్‌ డెలివరీ

ABN , First Publish Date - 2020-08-14T14:25:32+05:30 IST

కలికిరి మండలం గుండ్లూరు రీచ్‌లో బయలుదేరి మాయమైన ఇసుక ఎట్టకేలకు..

మాయమైన ఇసుక పీలేరులో డోర్‌ డెలివరీ

కలికిరి(చిత్తూరు): కలికిరి మండలం గుండ్లూరు రీచ్‌లో బయలుదేరి మాయమైన ఇసుక ఎట్టకేలకు పది రోజుల తర్వాత అనుకున్న చోట గురువారం డెలివరీ అయ్యింది. పీలేరు బోడుంపల్లెకు చెందిన ఎం.కృష్ణా రెడ్డి అనే వినియోగదారుడు గత నెల 31న డోర్‌ డెలివరీ పద్ధతిలో 18 టన్నుల ఇసుకను ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నారు. నాలుగో రోజు అంటే 3వ తేదీన ఇసుక టిప్పర్‌ బయలుదేరిందని కృష్ణా రెడ్డికి మెసేజ్‌ అందింది. మరి కొంచెం సేపటికి ఇసుక డెలివరీ అయినట్లు మరో మెసేజ్‌ వచ్చింది.


అయినా ఇసుక డెలివరీ కాకపోవడంతో ఆయన మూడు రోజుల తరువాత కలికిరి పోలీసులను ఆశ్రయించారు. ఇది ఏపీఎండీసీ వ్యవహారమని, వాళ్ళనే సంప్రదించాలని కలికిరి పోలీసులు సలహా ఇవ్వడంతో కృష్ణా రెడ్డి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆంధ్రజ్యోతిలో ఆదివారం ఇసుక మాయ(ం)పై కథనం వచ్చింది. దీంతో స్పందించిన మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ నెల 4న సరైన రికార్డులు లేనందున కలికిరిలో ఒక టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారని, తీరా చూస్తే పీలేరు వినియోగదారుడికి చేరాల్సిన టిప్పర్‌ ఇదేనని వివరించారు.


బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. అయితే 3వ తేదీనే ఇసుక రవాణా జరిగినట్లు, డెలివరీ కూడా అయినట్లు ఏపీఎండీసీ చేస్తున్న వాదనల కారణంగా ఇది వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బుకింగ్‌ చేసుకున్న పదమూడు రోజుల తర్వాత ఎట్టకేలకు కృష్ణా రెడ్డికి గురువారం సాయంత్రం డోర్‌ డెలివరీ పద్ధతిలో ఇసుక చేరింది. ఈ మేరకు వినియోగదారుడు కృష్ణా రెడ్డి ఆంధ్రజ్యోతికి సమాచారం అందజేశారు.


Updated Date - 2020-08-14T14:25:32+05:30 IST