Olympics: ఉగాండా అథ్లెట్ అదృశ్యం! షాకింగ్ విషయం వెలుగులోకి..

ABN , First Publish Date - 2021-07-18T01:32:45+05:30 IST

టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ శిబిరంలో సన్నద్ధమవుతున్న ఉగాండా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు జూలియస్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో కలకలం రేపుతోంది.

Olympics: ఉగాండా అథ్లెట్ అదృశ్యం! షాకింగ్ విషయం వెలుగులోకి..

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ శిబిరంలో సన్నద్ధమవుతున్న ఉగాండా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు జూలియస్ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ మీడియా మరో సంచలన విషయం వెలుగులోకి తెచ్చింది. ఉగాండాలో జీవితం కష్టంగా ఉండటంతో తాను జపాన్‌లోనే ఉండిపోవాలనుకుంటున్నట్లు ఓ చీటీ రాసిపెట్టి అతడు వెళ్లిపోయినట్టు స్థానిక మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. మీడియా కథనం ప్రకారం.. అతడు వచ్చే వారమే స్వదేశానికి తిరిగెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు కనిపించకుండా పోయాడు. 


ఒసాకా రాష్ట్రంలోని  ఇజుమిసాన నగరంలో గల శిక్షణా శిబిరంలో ఉన్న 8 మంది సభ్యుల ఉగాండా టీంలో జూలియస్ ఒకడు. శుక్రవారం నాడు తోటి క్రీడాకారులు జులియస్ గదికి వెళ్లగా అతడి జాడ కనిపించలేదు. ఎంత వెతికినా జూలియస్ కనిపించక పోవడంతో అతడు ఎక్కడికెళ్లాడనే దానిపై రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కాగా.. అతడు సెంట్రల్ జపాన్‌లోని నగోయా స్టేషన్‌కు రైలు టిక్కెట్టు కొనుక్కున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని స్థానిక మీడియా పేర్కొంది.

Updated Date - 2021-07-18T01:32:45+05:30 IST