పసలేని ‘మిషన్ వందే భారత్’

ABN , First Publish Date - 2020-08-05T06:21:45+05:30 IST

పథకాలు, ప్రత్యేక కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్ర స్ధాయిలోని వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి కరోనా సహాయక చర్యలు...

పసలేని ‘మిషన్ వందే భారత్’

కరోనా కాటుతో ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయుల సంఖ్యను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలూ విఫలమయ్యాయి. ప్రవాసులను తీసుకురావడానికి ఉద్దేశించిన ‘మిషన్ వందే భారత్’ క్రింద దశల వారీగా నడుపుతున్న విమానాల సంఖ్య ప్రయాణీకుల సంఖ్యకు తగినట్లుగా లేదు. పైగా విమానాల పరిమాణం చిన్నదిగా ఉండి తక్కువ మంది ప్రయాణీకులను మాత్రమే తీసుకువెడుతున్నాయి.


పథకాలు, ప్రత్యేక కార్యక్రమాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్ర స్ధాయిలోని వాస్తవాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రత్యేకించి కరోనా సహాయక చర్యలు చేపట్టడంలో కేంద్రం తన వంతు కృషిని పెద్దగా ఏమీ చేయకుండా మొత్తం బాధ్యతలను రాష్ట్రాల నెత్తిన రుద్దింది. చివరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను కూడ రాష్ట్రాలకు అప్పజెప్పింది. కరోనా పీడితులకు సహాయక చర్యలలో భాగంగా విదేశాలలో నివాసముంటున్న భారతీయులను మాతృదేశానికి తీసుకురావడానికి ఉద్దేశించిన ‘వందే భారత్ మిషన్’ను ఉదాహరణగా తీసుకుంటే అనేక చేదు నిజాలు వెల్లడవుతాయి.


కరోనా కాటుతో ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయుల సంఖ్యను అంచనా వేయడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా విఫలమయ్యాయి. విమానాలను నిషేధించిన నలభై రోజుల తర్వాత విదేశాల నుంచి ప్రవాసులను తీసుకురావడానికి ఉద్దేశించిన ‘మిషన్ వందే భారత్’ను గత మే నెలలో కేంద్రం ప్రారంభించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రచారం దృష్ట్యా ఈ ప్రత్యేక విమానాలపై లక్షలాది ప్రవాసులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు కానీ తీరా చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉంది. 


‘మిషన్ వందే భారత్’ క్రింద దశల వారీగా నడుపుతున్న విమానాల సంఖ్య ప్రయాణీకుల సంఖ్యకు తగినట్లుగా లేదు. పైగా విమానాల పరిమాణం చిన్నదిగా ఉండి తక్కువమంది ప్రయాణీకులను మాత్రమే తీసుకు వెళ్ళుతున్నాయి. ఈ విషయాన్ని అలా వుంచితే ప్రయాణీకులను ఎంపిక చేయడంలో ఏలాంటి పారదర్శకత పాటించకపోవడం ఎంతైనా ఆందోళన కల్గిస్తున్న విషయం. తమను స్వదేశానికి పంపించడంటూ ఎంతోమంది ప్రవాసులు తమ పేర్లను భారతీయ దౌత్య కార్యాలయాల వెబ్‌సైట్లలో నమోదు చేసుకోవడం జరిగింది. ఇది జరిగి నెలలు గడుస్తున్నా వారికి ఇంతవరకు ఎలాంటి పిలుపు రాలేదు! ఎవర్ని ఏ విధంగా పంపాలో అర్థంకాక అధికారులు సైతం చేతులెత్తేసారు. ఇప్పటి వరకు అయిదు దశల వారీగా విమానాలను నడుపుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపారని చెప్పవచ్చు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రవాసులు ఉన్న యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల నుంచి నిమిత్త మాత్రంగా వందే భారత్ మిషన్ విమానాలను నడిపారు. మహాఅయితే పది శాతం మందిని మాత్రమే తీసుకువెళ్ళి మిగిలిన తొంభై శాతం మందిని ప్రైవేట్ చార్టర్ విమానాలకు వదిలిపెట్టారు.


ప్రైవేట్ చార్టర్ల విషయానికి వస్తే, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రవాసుల సంఘాలు లేదా గల్ఫ్లోని సేవా సంఘాలు తమ రాష్ట్రాల ప్రయాణీకులను ప్రత్యేక అద్దె విమానాల ద్వారా సొంత రాష్ట్రాలకు తీసుకు వెళ్ళే విధంగా కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. కేంద్రం విఫలమై తమ నెత్తినపడ్డ ప్రయాణీకుల రద్దీని తగ్గించుకోవడానికి చార్టర్ విమానాలకు అనుమతినిచ్చి కేంద్రం తన చేతులను దులుపుకొంది. దీంతో గల్ఫ్లోని అనేక ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు ప్రవాస సంఘాల సహాయంతో దోపిడీకి శ్రీకారం చుట్టి అధిక ధరలకు విమానాల టిక్కెట్లను విక్రయిస్తున్నాయి.


ఇక క్వారంటైన్ అనేది తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయంతో గిరాకీలేక నష్టాల్లో కూరుకున్న స్టార్ హోటళ్ళకు వరంగా మారింది. హోటళ్ళ బిల్లు ముందుగా విదేశాలలో చెల్లించిన తర్వాత మాత్రమే విమానాల ల్యాండింగ్కు అనుమతి ఇస్తున్నారు. హోటల్ చార్జీల వసూలుపై ఉన్న శ్రద్ధ కరోనా పరీక్షలపై ఏమాత్రం లేదు. అంతేకాదు, వారం రోజుల క్వారంటైన్ తర్వాత ప్రవాసులను పరీక్షించి కరోనా లేనట్లుగా తెలితేనే వారిని హోటళ్ళ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించాలి. అయితే హైదరాబాద్లో మాత్రం ఇటువంటి పరిస్థితి లేదు. ఇదెంతైనా శోచనీయం. విదేశాల నుంచి వచ్చిన వారు బస చేస్తున్న హోటళ్ళ దరిదాపులలో కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎవరూ కానరావడం లేదు. ఎలాంటి పరీక్షలు చేయకుండా వదిలి పెడుతున్నారు! కేవలం హోటల్ అద్దె కొరకు మాత్రమే వారిని క్వారంటైన్ చేస్తున్నట్లుగా విమర్శలు ఉన్నాయి. కేంద్రం గత ఆదివారంనాడు ప్రకటించిన నూతన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు చేయించుకోని నెగెటివ్గా ఉన్నవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వడం పెద్ద ఊరట కలిగించే విషయం. ఇంతకూ చెప్పవచ్చిన దేమిటంటే విదేశాల నుంచి తిరిగివస్తున్న తెలుగు ప్రవాసులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ మరింత శ్రద్ధ చూపాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్, ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-08-05T06:21:45+05:30 IST